
మెహిదీపట్నం, వెలుగు: డిగ్రీ, పీజీ కోర్సుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయడంతో పాటు సంక్షేమ హాస్టళ్లల్లో సమస్యలు పరిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేకపోతే హైదరాబాద్ సిటీని లక్షల మంది స్టూడెంట్లతో దిగ్బంధిస్తామని రాష్ట్ర సర్కార్‌ను హెచ్చరించారు. ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ చదివే 14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టూడెంట్లకు రెండేండ్ల ఫీజు బకాయిలు రూ.3,300 కోట్లు రిలీజ్ చేయాలని కోరారు. అలాగే, పూర్తి ఫీజుల స్కీమ్‌ను పునరుద్ధరించాలని, స్కాలర్ షిప్‌ను రెండు రెట్లు పెంచాలని డిమాండ్ చేశారు.
గురువారం వేల మంది స్టూడెంట్లతో మాసబ్ ట్యాంక్‌లోని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ ఆఫీసును.కృష్ణయ్య ముట్టడించారు. ‘‘కలెక్టరేట్లు కట్టడానికి నిధులు వస్తాయి.. కానీ, స్టూడెంట్ల ఫీజులకు నిధులు లేవా.?”అంటూ స్టూడెంట్లు నినాదాలు చేశారు. పెరిగిన ధరల ప్రకారం స్కాలర్‌షిప్‌లు పెంచాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ, ఇంటర్ తదితర కాలేజీ కోర్సులు చదివే బీసీ విద్యార్థుల మొత్తం ఫీజుల స్కీమును పునరుద్ధరించాలన్నారు. బీసీ శాఖను బీసీ వ్యతిరేక శాఖగా మార్చారని, దీనిపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు.