ముట్టడి పోస్టర్ రిలీజ్ చేసిన ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముట్టడి పోస్టర్ రిలీజ్ చేసిన ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్టూడెంట్లకు రావాల్సిన ఫీజు బకాయిలు చెల్లించాలని, స్కాలర్​షిప్ లు పెంచాలని డిమాండ్​చేస్తూ ఈ నెల 25న అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడిస్తున్నట్లు ఎంపీ ఆర్.కృష్ణయ్య చెప్పారు. దాదాపు 15 లక్షల మంది స్టూడెంట్లకు  ప్రభుత్వం రెండేళ్లుగా ఫీజు బకాయిల కింద రూ.3,500 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. హైదరాబాద్​విద్యానగర్ లోని బీసీ భవన్ లో ఆదివారం రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చలో కలెక్టరేట్ పోస్టర్​ను ఆర్.కృష్ణయ్య ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు బడ్జెట్ కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు.

ఫీజు రియంబర్స్​మెంట్ ​బకాయిలు రిలీజ్​చేయకపోవడంతో కాలేజీ మేనేజ్ మెంట్లు విద్యార్థులను వేధిస్తున్నాయని, ఫలితంగా చాలామంది చదువుకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ఇంతకన్నా అన్యాయం ఎక్కడన్నా ఉంటుందా అని ప్రశ్నించారు. బీసీ సంక్షేమ శాఖ దిక్కులేని శాఖగా మారిందని మండిపడ్డారు. కమిషనర్ లేరు, బీసీ కార్పొరేషన్ కు ఎండీ లేరు, గురుకుల సొసైటీకి ఐఏఎస్ ఆఫీసర్ ​లేరని అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయమై సీఎం కేసీఆర్​సమీక్ష నిర్వహించాలని డిమాండ్​చేశారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, లీడర్లు రాజేందర్, జనార్దన్, సతీశ్, రామకోటి, నాగరాజు, వేణు, శివ కుమార్  పాల్గొన్నారు.