
- జాతీయ సెమినార్‌లో ఎంపీ ఆర్. కృష్ణయ్య
- కులగణన లెక్కలు వచ్చాక బీసీలకు వాటా లభిస్తుందని ఆశాభావం
న్యూఢిల్లీ, వెలుగు: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించే వరకూ బీసీ ఉద్యమాన్ని కొనసాగించాలని వివిధ పార్టీలకు చెందిన12 మంది పార్లమెంట్ సభ్యులు పిలుపునిచ్చారు. మంగళవారం ఢిల్లీలోని ఆంధ్ర భవన్ అంబేద్కర్ ఆడిటోరియంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల హక్కులపై జాతీయ సెమినార్ నిర్వహించారు.
సెమినార్ లో వివిధ రాష్ట్రాల నుంచి మేధావులు, ఉద్యమకారులు, బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. జనగణనలో కుల గణన చేపట్టాలని నిర్ణయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు రాజ్యాంగ బద్ధమైన హక్కులు, ఇతర డిమాండ్లు ప్రధాని మోదీ ద్వారానే సాధ్యమన్నారు.
కుల గణన లెక్కలు వచ్చిన తర్వాత విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో బీసీల వాటా బీసీలకు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సెమినార్‌లో బీద మస్తాన్ రావు, సురేష్ రెడ్డి, రవిచంద్ర, బస్తీ నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ, దూదిమల్ల ప్రసాద్ రావు, పాక సత్యనారాయణ, కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎంపీ బాల్క సుమన్, ప్రవీణ్ కుమార్, సభకు రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు, ఇంచార్జ్ నూకనమ్మ, దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్ షణ్ముగం, ఢిల్లీ అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, అంజి తదితరులు పాల్గొన్నారు.