- ఈ ఉద్యమంలో వెన్నుపోటు, కుట్రలున్నా లక్ష్యాన్ని చేరుకుంటం: ఆర్. కృష్ణయ్య
బషీర్బాగ్, వెలుగు: తన చివరి రక్తపుబొట్టు వరకు బీసీ జాతి కోసం పోరాటం చేస్తానని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆయన అధ్యక్షతన హైదరాబాద్ లక్డీకాపూల్ లోని ఓ హోటల్ లో భవిష్యత్ కార్యాచరణపై బీసీ కుల సంఘాల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. పదవులు, ప్రయోజనాల కోసం ఏ రాజకీయ నాయకుడికి లొంగకుండా కేవలం బీసీ భవిష్యత్తు తరాల కోసం ఉద్యమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఉద్యమంలో వెన్నుపోట్లు, కుట్రలు, పేదరికం, బలహీనతలు ఉన్నా, వాటిని ఎదుర్కొంటూ లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు.
ఓట్లు మావి.. సీట్లు మీవా..?
నారాయణ మూర్తి మాట్లాడుతూ.. కామారెడ్డి సభలో ప్రకటించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర నాయకులందరినీ ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు తీసుకెళ్లి చర్చించాలని సూచించారు. “ఓట్లు మావి, సీట్లు మీవా? ఇకపై కుదరదు.. ఓట్లు మావే, సీట్లు మావే” అనే నినాదంతో బీసీలు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డైరెక్టర్ శంకర్, వకులాభరణం కృష్ణ మోహన్ పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి
బీసీ రిజర్వేషన్ల డిమాండ్ తో బీసీ విద్యార్థులతో కలిసి లక్డీకాపుల్లోని హైదరాబాద్ కలెక్టరేట్ ను ముట్టడించారు. పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం మాట మార్చి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.
హైకోర్టులో కేసు గెలుస్తుందని... కేసు గెలవడానికి బలమైన ఆధారాలు ఉన్నాయన్నారు. పార్లమెంటులో ఇండియా కూటమికి 240 మంది ఎంపీలు ఉన్నారని.. వారు పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
