సీఎం రిలీఫ్​ ఫండ్​పై సంతకం చేస్తలే : ఎంపీ రఘునందన్​ రావు​

సీఎం రిలీఫ్​ ఫండ్​పై సంతకం చేస్తలే : ఎంపీ రఘునందన్​ రావు​

మెదక్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం అయిన రేవంత్ రెడ్డి ఏడు నెలల నుంచి సీఎం రిలీఫ్​ఫండ్​ఫైల్ పై సంతకం చేయలేదని ఎంపీ రఘునందన్​ రావు​ఆరోపించారు. దీంతో అనేక మంది బాధితులు ఇబ్బంది పడుతున్నారన్నారు. పీఎం రిలీఫ్​ ఫండ్​నుంచి ఆర్థిక సాయం మంజూరు చేయించి కష్టాల్లో ఉన్న కార్యకర్తలను ఆదుకుంటానని చెప్పారు. సోమవారం మెదక్​ పట్టణంలోని బీజేపీ జిల్లా ఆఫీస్​లో ఏర్పాటు చేసి కృతజ్ఞత సభలో పాల్గొని మాట్లాడారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో ఎంపీ ఆఫీస్​లు ఏర్పాటు చేస్తామని, ప్రజల సమస్యలపై స్పందించే విధంగా అక్కడ వ్యవస్థ ఏర్పాటు చేస్తానన్నారు.  

ముఖ్యంగా ఫీజుల విషయంలో, మెడికల్ బిల్లుల విషయంలో 24 గంటలు అందుబాటులో ఉంటానని చెప్పారు. పైసల వెనుకల రఘునందన్ పరిగెత్తడని, ప్రజల మేలు కోసమే పనిచేస్తాడని చెప్పారు. ఇప్పటి నుంచే సర్పంచ్​, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్​ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు పరిణిత, నందారెడ్డి, మధు, నర్సింగ్​రావు​, రాములు, ప్రసాద్​ పాల్గొన్నారు. 

నర్సాపూర్​కు రైలుమార్గం

నర్సాపూర్ : బీజేపీ ప్రభుత్వ హయాంలో నర్సాపూర్ నియోజకవర్గానికి ట్రిపుల్​ఆర్ తో పాటు రైలు కూడా వస్తుందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. పట్టణంలోని సాయి కృష్ణ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. 20 ఏళ్లుగా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రం అభివృద్ధికి ప్రస్తుత,  మాజీ ఎమ్మెల్యేలు చేసిందేమీ లేదన్నారు. నియోజకవర్గ కేంద్రంలో ఉండాల్సిన  విద్యాసంస్థలను ఒకరు గోమారంనకు, మరొకరు కౌడిపల్లికి మంజూరు చేయించుకుని స్టూడెంట్స్​కు తీవ్ర అన్యాయం చేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యే నర్సాపూర్​లో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు కేటాయించకపోతే అర్హులకు తామే పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్, రఘువీరారెడ్డి, రమేశ్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, రాకేశ్ పాల్గొన్నారు.

ప్రసాద్ దర్శన్ తో ఏడుపాయల అభివృద్ధి

పాపన్నపేట : ప్రసాద్ దర్శన్ పథకం కింద ఏడుపాయల అభివృద్ధికి కృషి చేస్తామని ఎంపీ రఘునందన్​ రావు​తెలిపారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆయన తొలిసారిగా ఏడుపాయలకు వచ్చారు.  పూజారులు, ఆలయ కమిటీ  చైర్మన్ బాలాగౌడ్ ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఎంపీని ఆలయ మర్యాదలతో సన్మానించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్ల కాలంలో ఏడుపాయల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు.

ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా, శాశ్వత నిర్మాణాలు చేపట్టిన దాఖలాలు లేవన్నారు. ఇక్కడ ఉన్న సత్రాలలో 90 శాతం దాతలు నిర్మించినవే నన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రసాద్ దర్శన్ కింద ఏడుపాయల్లో అభివృద్ధి పథకాలు చేపడుతామని చెప్పారు. అవసరమైన పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఈవో కృష్ణ ప్రసాద్ కు  సూచించారు.