జనగామ, వెలుగు: ‘గాంధీ’ అనే తోక లేకుండా కాంగ్రెస్ పార్టీ బతకలేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. జనగామలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము మాత్రం గాంధీ సమాధిపై ఉన్న ‘హే రామ్’ అంటామని అన్నారు. ‘జై శ్రీరామ్ అంటే పైసలు వస్తాయా’ అంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, అలాంటి వ్యక్తి దేవాదాయ శాఖ మంత్రిగా ఎలా కొనసాగుతున్నారని ప్రశ్నించారు.
జై సోనియా అంటే ఇటలీ, దేశ పౌరసత్వం గుర్తుకు వస్తుందని, జై ఇందిర అంటే ఎమర్జెన్సీ గుర్తుకు వస్తుందని అన్నారు. ప్రజల పన్నులతో ఇళ్లు కట్టించి వాటికి ఇందిరమ్మ పేరు పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకిగా మారిపోయిందన్నారు.
సోమనాథ్ ఆలయ నిర్మాణాన్ని నెహ్రూ వ్యతిరేకించారని, రామాలయాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వ్యతిరేకించారని గుర్తు చేశారు. దేవుళ్లు, గుడులు లేవని చెప్పే మమతా బెనర్జీ, స్టాలిన్ ఎమ్మెల్యేలుగా గెలవలేదని అన్నారు. సీఎం పదవికి రాజీనామా చేయనన్న దీదీని ఎత్తి బంగాళాఖాతంలో పడేస్తామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురడం ఖాయమన్నారు.
