- 44 పనుల్లో 16 పనులు మాత్రమే కంప్లీట్
- అధికారుల తీరుపై మండిపడిన ఎంపీ రఘునందన్రావు
సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లాలో ఎంపీ లాడ్స్ కింద 44 పనులకు నిధులు మంజూరు కాగా 16 పనులు మాత్రమే కంప్లీట్ కావడంపై ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని పనులు కంప్లీట్ చేశాకే మళ్లీ నిధులు కేటాయిస్తానన్నారు. గురువారం ఆయన అధ్యక్షతన 'దిశా' సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఎంపీ లాడ్స్ కింద తాను నిధులు మంజూరు చేపిస్తే తనకు ఆ పనులకు సంబంధించిన వివరాలను చెప్పడం లేదని, పనుల ప్రారంభానికి పిలవడం లేదని ఆరోపించారు. ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హైమావతి కి సూచించారు. గత దిశా సమావేశానికి సంబంధించిన యాక్షన్ టేకెన్ రిపోర్ట్, గత ఎంపీల కాలంలో మంజూరైన నిధుల వివరాలు సమర్పించాలన్నారు.
అర్హత కలిగిన వారికి దుబ్బాకలో మిగిలిన డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించాలని, పంచాయితీ రాజ్ శాఖలో 75 అంగన్వాడీ భవనాలు మంజూరయ్యాయని సకాలంలో నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అందులో స్థలం సమస్యలు ఉన్నవాటిని కలెక్టర్ పర్యవేక్షించి పరిష్కరించాలని సూచించారు. గోసాన్ పల్లి సబ్ స్టేషన్ పనులు త్వరితగతిన ప్రారంభించాలని, విద్యుత్ ఘాతంతో ప్రమాదాలకు గురైన బాధితులు, వారి కుటుంబాలకు సహకారం అందించాలని, మల్లన్నసాగర్ ద్వారా దుబ్బాక నియోజకవర్గంలోని చివరి గ్రామాల వరకు కాల్వలు, చెరువుల ద్వారా నీళ్లు అందించాలన్నారు.
ప్రైవేట్ ఆస్పత్రులపై నిఘా పెట్టాలని, ఫైర్ సేఫ్టీ, పార్కింగ్ స్థలాలు లేకుండా నిర్వహిస్తున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కచ్చితంగా ప్రతీ ఆస్పత్రిలో రేట్ చార్టులు ఉండేలా చూసుకోవాలని, ఎంసీహెచ్లపై పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.
గజ్వేల్ ఆస్పత్రిలో పనిచేయని సిబ్బందికి వేతనాలు చెల్లిస్తున్నారని, వాటిని రికవరీ చేయాలని, రోగులకు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిందిగా సూచిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లక్ష పైగా కార్మికులు ఉన్నచోట ఈఎస్ఐ ఆస్పత్రి మంజూరు చేస్తారని వారి వివరాలను సమర్పిస్తే ఈఎస్ఐ ఆస్పత్రి కోసం ప్రతిపాదనలు పంపిస్తానని ఏసీఎల్ శ్రీనివాస్ కు తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్డీవో జయదేవ్ ఆర్య పాల్గొన్నారు.
