మెదక్, వెలుగు: చేగుంట రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభించి యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని ఎంపీ రఘునందన్ రావు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్ రాజ్‌తో పాటు, రైల్వే, ఫారెస్ట్, ఆర్ అండ్‌బీ, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీ మాట్లాడుతూ చేగుంట వద్ద రైల్వే క్రాసింగ్ ఉండడం వల్ల రైళ్లు వచ్చిన ప్రతీసారి మెదక్ -హైదరాబాద్ రూట్లో వాహనాల రాకపోకలు నిలిచి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
ప్రధానంగా పేషంట్లను, ప్రమాదాల్లో గాయపడ్డ వారిని అత్యవసరంగా ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోతున్నారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రైల్వే ఓవర్‌బ్రిడ్జి మంజూరు చేయించినట్టు చెప్పారు. సంబంధిత డిపార్ట్మెంట్ల అధికారులు, కాంట్రాక్టర్ కలిసి సమన్వయంతో వాహనాల రాకపోకలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఆర్వోబీ పనులు చేపట్టాలని సూచించారు.
సర్వీస్ రోడ్లు, డ్రైనేజీ, లైటింగ్, సిగ్నలింగ్ వంటి అనుబంధ సదుపాయాలను సమగ్రంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఈ మార్గాన్ని జీరో యాక్సిడెంట్ రూట్‌గా మార్చడం లక్ష్యంగా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
