ఇందిరమ్మ స్కీమ్లో ఎంపీలకు 40% కోటా ఇవ్వండి : ఎంపీ రఘునందన్ రావు

ఇందిరమ్మ స్కీమ్లో ఎంపీలకు 40%  కోటా ఇవ్వండి : ఎంపీ రఘునందన్ రావు
  • సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్ రావు లేఖ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పార్లమెంట్ సభ్యులకు లబ్ధిదారుల ఎంపికలో 40 శాతం కోటా కేటాయించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేదలు, బలహీన వర్గాలకు నూతన గృహాలు నిర్మిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను అనుసంధానం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. 

అయితే, ఈ పథకంలో లబ్ధిదారులను ఎంపిక చేయడానికి స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేలకు 40 శాతం కోటా ఇవ్వడాన్ని స్వాగతిస్తూనే, ప్రజల మద్దతుతో గెలిచిన తెలంగాణలోని 17 మంది ఎంపీలకు కూడా లబ్ధిదారుల ఎంపికలో 40 శాతం కోటా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.