యువతతోనే నవ సమాజ నిర్మాణం సాధ్యం : ఎంపీ రఘునందన్రావు

యువతతోనే నవ సమాజ నిర్మాణం సాధ్యం : ఎంపీ రఘునందన్రావు
  •     ఎంపీ రఘునందన్​రావు

మెదక్​ టౌన్, వెలుగు: యువతతోనే  నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఎంపీ రఘునందన్​ రావు అన్నారు. మెదక్​ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్​ కాలేజీలో జిల్లా యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏకతా దివస్ వేడుకలను నిర్వహించారు. 

కాలేజీ నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన కూడలి రాందాస్​ చౌరస్తా వరకు కొనసాగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ రఘునందన్​రావు మాట్లాడుతూ... పటేల్ స్వాతంత్ర్యం తర్వాత 565 సంస్థానాలను భారత సమాఖ్యలో విలీనం చేసిన సమైక్యతావాది, మానవతావాది అని కొనియాడారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత సమాఖ్యలో విలీనం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ప్రస్తుతం యువత సర్దార్ పటేల్ ఆదర్శాలతో ముందుకు సాగి జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న సంస్థానాలను భారత యూనియన్​లో కలిసేందుకు పటేల్ ఎంతో కృషి చేశారన్నారు. ఆ మహనీయుడి కృషి ఫలితంగానే మన దేశాన్ని ఒకే చిత్రపటంలో చూస్తున్నామన్నారు. జాతీయ ఐక్యత దినోత్సవ స్ఫూర్తితో ప్రతి విద్యార్థి దేశ ప్రగతికి కృషి చేయాలని సూచించారు. 

విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా యువజన క్రీడల నిర్వహణ అధికారి రంజిత్ రెడ్డి, డీఐఎస్​వో రమేశ్, డీఎస్​వో రాజిరెడ్డి, సంబంధిత అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.


 
మెదక్​ గ్రంథాలయాన్ని రాష్ట్రానికే  మోడల్​గా తీర్చిదిద్దాలి

 

మెదక్​ జిల్లా గ్రంథాలయాన్ని రాష్ట్రానికే మోడల్​గా తీర్చిదిద్దాలని ఎంపీ రఘునందన్​రావు సూచించారు. 58వ  గ్రంథాలయాల వారోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్​పర్సన్​ సుహాసినిరెడ్డి, కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..  తాను రూ.5 లక్షల విలువైన పుస్తకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు దీనికి ప్రణాళిక చేయాలని గ్రంథాలయ కార్యదర్శికి సూచించారు. ఈ గ్రంథాలయంలో చదివి పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. 

సుహాసినిరెడ్డి మాట్లాడుతూ.. సమాచార  సేకరణకు గ్రంథాలయాలు చాలా ఉపయోగపడుతాయన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రంథాలయాలు నాలెడ్జ్ హబ్‌గా పనిచేస్తాయని,అన్ని వయస్సుల వారికి ఉపయోపడతాయన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి వంశీకృష్ణ, లైబ్రేరియన్లు, పాఠకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్​ ఓటర్ల తీర్పు స్వాగతిస్తున్నాం


మెదక్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటర్ల తీర్పును స్వాగతిస్తున్నామని ఎంపీ రఘునందన్​ రావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బై ఎలక్షన్​లో గెలుపు కోసం తమ పార్టీ కార్యకర్తలు, నాయకులం శక్తిమేరకు ప్రయత్నం చేశామన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్య నాయకులు కూర్చొని చర్చించి లోటుపాట్లను సరిదిద్దుకుంటామని, భవిష్యత్​లో జరిగే ఎన్నికల్లో గెలుపొందేలా కృషి చేస్తామన్నారు.  

బీహార్ లో ఎన్డీఏ గెలుపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ పని తీరుకుని నిదర్శనమని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే అభివృద్ధి సాధ్యమని నమ్మి బీహార్ ఓటర్లు ఎన్డీఏకు మళ్లీ పట్టం కట్టారన్నారు. గుండా రాజ్​వద్దనుకున్నారని, కుటుంబ వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడారన్నారు.