- దిశ మీటింగ్లో అధికారులపై మెదక్ ఎంపీ ఆగ్రహం
మెదక్, వెలుగు: ‘స్కీమ్స్ మా సర్కార్వి, ఫండ్స్ ఇచ్చేది మా సర్కార్.. కానీ అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు మాకే చెప్పరా?’ అంటూ ఎంపీ రఘునందన్రావు ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం దిశ కమిటీ సమావేశం ఎంపీ అధ్యక్షతన కలెక్టరేట్ లో జరిగింది. ప్రధాన మంత్రి కృషి సంచాయ్ యోజన కింద 2017–18లో రూ.2.10 కోట్లు వచ్చాయని, వాటితో ఎక్కడ ఏ పని చేశారని ఆయన ప్రశ్నించారు.
ఆ నిధులు వినియోగించకపోవడంతో 2018-–19 లో ఫండ్స్ రాలేదన్నారు. ఫామ్ మెకనైజేషన్ కింద 2025-–26 సంవత్సరానికి జిల్లాకు రూ.2.09 కోట్లు వచ్చాయని డీఏవో దేవ కుమార్ తెలిపారు. ఆ విషయాన్ని గ్రామాల్లో రైతులకు చెప్పకుంటే ఏం లాభమని, అంతా మీ ఇష్టారాజ్యమా అని ఎంపీ మండిపడ్డారు. లోకల్ రిప్రజెంటేటివ్స్కు చెప్పామని డీఏవో సమాధానం ఇవ్వగా ప్రస్తుతం సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఎవరూ లేరు.. మరి ఎవరికి చెప్పారని ప్రశ్నించారు.
ఎమ్మెల్యేలకు చెప్పామని తెలుపగా.. ఎంపీకి చెప్పరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌడిపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో పీఎంశ్రీ నిధులు దుర్వినియోగం అయ్యాయని, దీనిపై ఎంక్వైరీ చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని పీఎంశ్రీ స్కూల్స్లో నిధుల వినియోగంపై విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని ఏఎంవో సుదర్శన మూర్తికి సూచించారు. మెదక్ పట్టణంలో అమృత్ స్కీం పనుల శంకుస్థాపనకు తాను వస్తే ఎందుకు రాలేదని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని అడిగారు.
తనకు ఆరోగ్యం బాగా లేక రాలేదని ఆయన చెప్పగా.. పొద్దంతా బాగుండి, తాను వచ్చేటప్పటికి బాగుండదా అని ప్రశ్నించారు. పార్లమెంట్ స్పీకర్ కు ఫిర్యాదు చేసి, ఢిల్లీకి పిలిపిస్తానని హెచ్చరించారు. మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు మంజూరు చేసిన ఎంపీ ల్యాడ్స్పనులు ఏళ్లు గడుస్తున్నా చాలా వరకు పెండింగ్ లో ఎందుకు ఉన్నాయని సీపీవోను ప్రశ్నించారు. వాటిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
తాను ఎంపీ అయ్యాక ఎంపీ ల్యాడ్స్ నుంచి 10 పనులు మంజూరు చేస్తే ఒక్క పని ప్రారంభానికైనా తనను పిలవరా అని పీఆర్ ఈఈ నర్సింలును ప్రశ్నించారు. ఢిల్లీ చూడాలని ఉంటే రండి, స్పీకర్కు కంప్లైంట్ చేసి పిలిపిస్తానన్నారు. పీఎం సూర్యఘర్పథకం కింద ఎంపిక చేసిన పాపన్నపేటలో వచ్చే జూన్ 30 లోగా ప్రతీ ఇంటికి సోలార్ సిస్టం ఏర్పాటు చేయాలని రెడ్ కో అధికారును ఆదేశించారు. కలెక్టర్ రాహుల్ రాజ్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.
మెదక్ లో క్యాన్సర్ స్ర్కీనింగ్ సెంటర్
దేశంలోని 736 జిల్లాల్లో క్యాన్సర్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ నిర్ణయించారని, ఇందులో భాగంగా మెదక్ లో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ రఘునందన్రావు తెలిపారు. ఇందుకోసం 1,000 గజాల స్థలం సేకరించాలని కలెక్టర్కు సూచించారు. అలాగే బీడీఎల్ కంపెనీ మొబైల్ క్యాన్సర్ స్ర్కీనింగ్ బస్ కోసం రూ.69.50 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించిందని తెలిపారు. ప్రతీ ఆదివారం ఆయా మండలాల్లోని ఓ హైస్కూల్ వద్ద క్యాన్సర్ స్క్కీనింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
