మైహోంకు భూములివ్వడంతో ఖజానాకు వందల కోట్ల నష్టం

మైహోంకు భూములివ్వడంతో ఖజానాకు వందల కోట్ల నష్టం

హైదరాబాద్‌‌, వెలుగుహైదరాబాద్​లోని రాయదుర్గం బయోడైవర్సిటీ సమీపంలో మైహోం బూజా ప్రాజెక్టుకు అక్రమంగా భూకేటాయింపులు చేశారని, దానివల్ల రాష్ట్ర ఖజానాకు వందల కోట్లలో నష్టం వాటిల్లిందంటూ ఎంపీ రేవంత్‌‌ రెడ్డి హైకోర్టులో పిల్​ దాఖలు చేశారు. అక్రమంగా, చట్టవ్యతిరేకంగా భూముల కేటాయింపు జరిగిందని, రూ.36 కోట్ల స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇవ్వడం కూడా అన్యాయమని అందులో పేర్కొన్నారు. ఈ భూదందాను అడ్డుకోవాలని కోరారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ ఆర్ఎస్‌‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌‌ ఎ.అభిషేక్‌‌రెడ్డిలతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌  సోమవారం దీనిని విచారణకు స్వీకరించింది. అందులో ప్రతివాదులుగా చేర్చిన ప్రభుత్వ సీఎస్, పరిశ్రమలు, మున్సిపల్‌‌ శాఖల ముఖ్య కార్యదర్శులు, టీఎస్ఐఐసీ ఎండీ, మైహోం బూజా, డీఎల్ఎఫ్‌‌  కంపెనీలు, ఇతర ప్రతివాదులకు నోటీసులిచ్చింది. అయితే ఆ భూములకు సంబంధించిన వ్యవహారాలపై స్టేటస్​కో ఇవ్వాలన్న రేవంత్​ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

రేవంత్​ రిట్​లో పేర్కొన్న అంశాలివీ..

‘‘రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని సర్వే నంబర్‌‌ 83లో 424.13 ఎకరాల భూమిని 2006లో ఉమ్మడి ఏపీ సర్కారు జీవో నంబర్‌‌ ఎంఎస్‌‌ 161 ద్వారా ‘ఏపీ ఇండస్ట్రియల్‌‌ అండ్‌‌ ఇన్‌‌ ఫ్రాస్ట్రక్చర్‌‌ కార్పొరేషన్‌‌ (ఏపీఐఐసీ)’కు కేటాయించింది. ఆ భూమి ఐటీ జోన్‌‌ పరిధిలో ఉన్నందున దానిని ఐటీ పార్కు, ఐటీ సంబంధిత ఇన్‌‌ ఫ్రా నిర్మాణాల కోసం మాత్రమే వినియోగించాలని స్టేట్‌‌ ఇన్ఫర్మేషన్‌‌ టెక్నాలజీ పాలసీ తేల్చి చెప్పింది. తర్వాత ఏపీఐఐసీ నుంచి డీఎల్ఎఫ్‌‌  లిమిటెడ్‌‌ సబ్సిడరీ కంపెనీ అయిన డీఎల్ఎఫ్‌‌ రాయదుర్గం డెవలపర్స్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ అనే సంస్థ వేలంలో 31.35 ఎకరాల భూమిని రూ.580 కోట్లకు పొందింది. భూమి రిజిస్టర్‌‌ అయ్యాక డీఎల్ఎఫ్‌‌ రాయదుర్గం డెవలపర్స్‌‌ సంస్థ తమ కంపెనీ పేరును ఆక్వా స్పేస్‌‌ డెవలపర్స్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌గా మార్చాలని కోరగా ప్రభుత్వం ఆమోదించింది. కొంతకాలం తర్వాత ఈ కంపెనీ తమకు కేటాయించిన భూమికి బదులు సమీపంలో మరోచోట భూమి ఇవ్వాలని, ఈ మేరకు అయ్యే రిజిస్ట్రేషన్‌‌ చార్జీలు కూడా మినహాయించాలని కోరింది. ఈ ప్రతిపాదనను కేసీఆర్‌‌  సర్కార్‌‌ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఆమోదించింది. కొంత లోపలి ప్రాంతంలోని భూములకు బదులు మెయిన్​రోడ్డులో అత్యంత విలువైన భూములను ఇచ్చింది, స్టాంప్‌‌డ్యూటీని కూడా మినహాయించింది. కేటాయింపులు జరిగిన 2006 నాటి లెక్కల ప్రకారమే.. ఈ మెయిన్​రోడ్డు పక్క భూముల ధర ఎకరా రూ.25 కోట్లు, కేసీఆర్​ సర్కారు ఓకే చెప్పిన సమయంలో రూ.42 కోట్లు. మైహోం కంపెనీకి మేలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆక్వా స్పేస్​కు భూముల కేటాయింపులో రాష్ట్ర ఖజానాకు వందల కోట్ల రూపాయల్లో నష్టం కలిగింది. దీనిపై విచారణకు ఆదేశించాలి” అని రేవంత్​ పిటిషన్లో కోరారు.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి