కేసీఆర్​, కేటీఆర్​కు ఫస్ట్​ ర్యాంక్​ రాలేదేం: రేవంత్ రెడ్డి

కేసీఆర్​, కేటీఆర్​కు ఫస్ట్​ ర్యాంక్​ రాలేదేం: రేవంత్ రెడ్డి

ఇరిగేషన్​, ఐటీ శాఖలు ఎందుకు వెనుకబడ్డాయో చెప్పాలి
ప్రభుత్వ శాఖలకు ర్యాంకులపై రేవంత్​ కామెంట్స్​
తండ్రీకొడుకులు అసమర్థులనడానికి ఇదే నిదర్శనమన్న కాంగ్రెస్​ ఎంపీ       

‘‘పొద్దునలేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పుకుంటున్నరు. ఐటీలో ఏవేవో అవార్డులొచ్చినయని ప్రకటనలు ఇస్తున్నరు. మరి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శాఖల ర్యాంకుల్లో మాత్రం సీఎం కేసీఆర్​, ఆయన కొడుకు కేటీఆర్ కిందికి జారిపోయారు. వాళ్లిద్దరూ అసమర్థులని, పని చేతగాదని నిర్వహించిన శాఖలే చెబుతున్నాయి”అని కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడిన ఆయన..  2018–19 ఏడాదికి ప్రభుత్వ శాఖల పనితీరుపై సీఎస్​ ఎస్కే జోషి ఇటీవల విడుదల చేసిన ర్యాంకులపై స్పందించారు.

ప్రభుత్వంలో మొత్తం 34 శాఖలు ఉండగా, ప్రిన్సిపల్​ సెక్రటరీల రిపోర్టుల ఆధారంగా 20 శాఖలకు ర్యాంకులు కేటాయించారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు ఫస్ట్​ ర్యాంక్​ దక్కగా, సీఎం కేసీఆర్​ నిర్వహిస్తున్న ఇరిగేషన్​కు ఎనిమిదో ర్యాంకు, విత్యుత్​ శాఖ 11వ ర్యాంకు, గతంలో కేటీఆర్​ నిర్వహించిన ఐటీ శాఖ 18వ ర్యాంకులో నిలిచాయి. తాము నిర్వహిస్తున్న శాఖల్ని గొప్పగా తీర్చిదిద్దామని కేసీఆర్​, కేటీఆర్​ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని, వాళ్ల పనితీరుకు ర్యాంకులే నిదర్శనమని రేవంత్​ అన్నారు. ఇకనైనా పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు.

అక్రమ సొమ్ముతో ప్రచారం.. అవార్డులు

అమెరికాలోని న్యూయార్క్​లోనూ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రదర్శించామని సీఎం కేసీఆర్​ గొప్పలు చెప్పుకోవడం దారుణమని, అది కాళేశ్వరం కాంట్రాక్టర్​ మెగా కంపెనీ ఇచ్చిన పెయిడ్​ ప్రకటన అని, అక్కడ ఎవరైనా యాడ్స్​ వేసుకోవచ్చని రేవంత్​ తెలిపారు.

ఈటల నామ్​కేవాస్తే
కాబట్టే పేరులేదు

సీఎస్​ జోషి రిపోర్టులో ఈటల రాజేందర్​ నిర్వహించిన ఆర్థిక శాఖ లేకపోవడంపై రేవంత్​ ఘాటుగా స్పందించారు. ఈటలను కేసీఆర్​ నామ్​కేవాస్తేగా భావిస్తారు కాబట్టే, పాలసీ విధానంలో సీఎం అన్నీ తానై వ్యవహరిస్తారు కాబట్టే రిపోర్టులో ఈటల పేరు లేదని విమర్శించారు. బీసీ వెల్ఫేర్​ శాఖ చివరి ర్యాంకులో ఉండటాన్ని బట్టి రాష్ట్రంలో బీసీ సంక్షేమం ఎలా అమలవుతోందో అర్థం చేసుకోవచ్చన్నారు. తన అసమర్థకు సీఎం కేసీఆర్​ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.