వ్యతిరేకించిన వాళ్లతో పొత్తెలా పెట్టుకున్నరు?

వ్యతిరేకించిన వాళ్లతో పొత్తెలా పెట్టుకున్నరు?
  • దిక్కులేకనే కమ్యూనిస్టుల కాళ్లు పట్టుకున్నరు
  • తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లతో పొత్తెలా పెట్టుకున్నరు?
  • సీఎం కేసీఆర్‌‌‌‌కు రేవంత్‌‌ రెడ్డి ప్రశ్న
  • మునుగోడులో కమ్యూనిస్టులు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి

హైదరాబాద్‌‌, వెలుగు: కమ్యూనిస్టులు ఎక్కడున్నారని గతంలో అవమానించిన కేసీఆర్‌‌.. ఇప్పుడు దిక్కులేకనే ఆ పార్టీ నేతల కాళ్లు పట్టుకుంటున్నారని పీసీసీ చీఫ్‌‌ రేవంత్‌‌ రెడ్డి అన్నారు. సీపీఐ నుంచి గెలిచిన రవీంద్రకుమార్‌‌ను టీఆర్‌‌ఎస్‌‌లో చేర్చుకొని సీపీఐని చావుదెబ్బ కొట్టారని గుర్తుచేశారు. ఆదివారం గాంధీ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కమ్యూనిస్టులు ఎందుకు కేసీఆర్‌‌ ఉచ్చులో పడుతున్నారని అర్థంకావడం లేదని, వారి నిర్ణయం తమను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. మునుగోడులో ఆ పార్టీల కార్యకర్తలు ఆత్మ పరిశీలన చేసుకొని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన సీపీఎంతో ఎలా పొత్తు పెట్టుకుంటారని ప్రశ్నించారు. కేసీఆర్‌‌ మునుగోడు ప్రచార సభలో మళ్లీ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడి ప్రజలను వంచించే ప్రయత్నం చేశారన్నారు. కేసీఆర్‌‌కు కోట్ల రూపాయల సాయం చేసినట్టు రాజగోపాల్‌‌ రెడ్డి చెప్తున్నారని, వాళ్లిద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంటో బయటపెట్టాలని డిమాండ్‌‌ చేశారు. తెలంగాణ వచ్చి ఎనిమిదేళ్లయినా ఎస్‌‌ఎల్‌‌బీసీ ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. డిండి ప్రాజెక్టును ఎప్పట్లోగా పూర్తి చేస్తారో ఎందుకు చెప్పడం లేదన్నారు. పోడు భూముల సమస్య, చర్లగూడెం, కిష్టరాయినిపల్లి రిజర్వాయర్ల నిర్వాసితుల సమస్యనూ ప్రస్తావించలేదన్నారు.

రాష్ట్రంలో బీజేపీ దుర్మార్గాలకు కేసీఆరే కారణం

రాష్ట్రంలో లేని బీజేపీని ప్రత్యామ్నాయంగా సృష్టించిందే కేసీఆర్‌‌ అని రేవంత్‌‌ అన్నారు. తెలంగాణపై బీజేపీ ముప్పేట దాడికి, ఆ పార్టీ దుర్మార్గాలకు కేసీఆరే కారణమన్నారు. పార్టీల ఫిరాయింపులకు బీజేపీకి కేసీఆరే ఆదర్శమని, పార్టీల విలీనానికి కిటికీలు తెరిచింది ఆయనేనన్నారు. విద్యుత్‌‌ సంస్కరణల బిల్లును పార్లమెంట్‌‌లో టీఆర్‌‌ఎస్‌‌ ఎంపీలు ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌‌ ఎంపీల పోరాటంతోనే ఆ బిల్లు సెలక్ట్‌‌ కమిటీకి వెళ్లిందన్నారు. తాను బీజేపీకి వ్యతిరేకం అని కేసీఆర్‌‌ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిపై ఒట్టేసి చెప్పాలన్నారు. మునుగోడు ఎన్నికను కేసీఆర్ ప్రధాని మోడీతో ముడిపెట్టారని, ఇది మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టడమేనని మండిపడ్డారు. డిండికి కేంద్రం నుంచి రూ.5 వేల కోట్ల ప్యాకేజీని అమిత్‌‌ షా ఇప్పించాలన్నారు.

రాజీనామాలతోనే అభివృద్ధి జరుగుతుందని బీజేపీ నమ్మితే ఆ పార్టీ నుంచి గెలిచిన నలుగురు ఎంపీలు రాజీనామా చేయాలన్నారు. కేసీఆర్‌‌ ఓడితేనే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. మునుగోడులో ముక్కోణపు పోటీలో గెలవాలని కేసీఆర్‌‌ చూస్తున్నారన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్‌‌ కల్లు దుకాణంలో చుడువా అమ్ముకునేవాడని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌‌ అన్నారు. కాంగ్రెస్‌‌పై ఆయన నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. సోనియా గాంధీ అపాయింట్‌‌మెంట్‌‌ కోసం తమ దగ్గరకు వచ్చిన విషయం మర్చిపోయావా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరిగే ప్రతి దందాలో కేసీఆర్‌‌ కుటుంబ భాగస్వామ్యం ఉందన్నారు. కాంగ్రెస్‌‌ను దెబ్బతీయడానికే బీజేపీతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిందన్నారు.