కేసీఆర్ కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవు

కేసీఆర్ కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవు

కేసీఆర్ కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవని మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. మహబూబాబాద్ జిల్లాలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఇటీవల జరిగిన ఫుడ్ పాయిజన్ పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషితమైన ఆహారం తిని మొత్తం 36మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన అధికార పార్టీ టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. పురుగలన్నం పెట్టి పేద పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే సర్కారును ఏ పదాలతో విమర్శించాలి? అంటూ కోపం వెల్లగక్కారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవని విమర్శించారు. అసలు ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు పిల్లల ప్రాణాల విలువ తెలుసా అని ప్రశ్నించారు. పేద బిడ్డలకు నాణ్యమైన బుక్కెడు బువ్వ పెట్టలేని పాలన దేనికి? అని దుయ్యబట్టారు. భోజనం తినేముందు ఆత్మపరిశీలన చేసుకో కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠళాల మధ్యాహ్న భోజనంలో వానపాము రావడం కలకలం రేపింది. ఆ ఆహారం తిని 36మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు..వార్డెన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. భోజనంలో బొద్దింకలు, జెర్రీలు, పురుగులు వస్తున్నాయని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఘటనకు వారందర్నీ తొలగించాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాగా ఆస్పత్రి పాలైన విద్యార్థులు క్షేమంగానే ఉన్నారని, ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు స్పష్టం చేశారు.