కోకాపేట దళితుల్ని వదిలేసి.. హుజూరాబాద్ దళితులకు..

కోకాపేట దళితుల్ని వదిలేసి.. హుజూరాబాద్ దళితులకు..

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలకు దిగారు.  వారసత్వ సంపదగా వచ్చిన భూములను కేసీఆర్ దోచుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. భూములు అమ్మి వాటి ద్వారా వచ్చే డబ్బులను కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు, ఫీజు రీఎంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ కోసం అమ్మాలని చూస్తే.. ఆనాడు టీఆర్‌ఎస్ నేతలే అడ్డుకున్నారని చెప్పారు. సీమాంధ్ర నేతలు అమ్మడానికి భయపడ్డారు.. కానీ ఇప్పుడు కేసీఆరే హాట్ కోర్‌‌గా ఉన్న కోకాపేట భూములను అమ్మేసిండని ఫైర్ అయ్యారు. కోకాపేట దళితులను వదిలేసి.. హుజూరాబాద్ దళితులకు ఖర్చు చేస్తానంటే నమ్మాలా అని రేవంత్ ప్రశ్నించారు. కోకాపేట దళితుల భూములు తీసుకొని.. కనీసం డబుల్ బెడ్ రూమ్ ఇవ్వకుంటే ఎలా అని క్వశ్చన్ చేశారు. 

అడ్డికి పావుసేరు చొప్పున అమ్మేశారు
‘గోల్డెన్ మెయిల్ పేరుతో టెండర్లు పిలిచి.. అందులోని 164 ఎకరాల్లో మిగిలిపోయిన 50 ఎకరాల భూమిని అడ్డికి పావుసేరు చొప్పున కేసీఆర్ అమ్మేసిండు. దాని విలువ వాస్తవంగా ఎకరాకు రూ.80 కోట్లకు పైగానే ఉంటుంది. కానీ రూ.30 కోట్లకు అమ్మేసిండు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సీఎం కాళ్లు మొక్కింది దీని కోసమే. రూ.3 వేల కోట్లు రావాల్సింది..  కానీ 2 వేల కోట్లే వచ్చాయి. మై హోమ్ రామేశ్వర్ రావు, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామి రెడ్డి, శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత కూడా కోకాపేట భూములను దక్కించుకున్నారు. భూముల అమ్మకాలపై హెచ్‌ఎండీఏ కమిషనరో, మంత్రి లేదంటే సిటీ మంత్రి జవాబు ఇస్తారనుకున్నా? కానీ ఇద్దరు కాలం చెల్లిపోయిన నేతలను పంపి తిట్లదండకం చవిదించారు’ అని రేవంత్ పేర్కొన్నారు.  

ప్రెస్టీజ్ ప్రాజెక్టు కూడా కేటీఆర్ బినామే
‘కోకాపేట భూముల విషయంలో అవినీతి జరిగిన విషయం కేసీఆర్, కేటీఆర్‌‌కు  తెలియదా? తునక భూమి అమ్మకం ద్వారా సర్కార్‌‌కు రూ.2 వేల కోట్లు వస్తే.. కేసీఆర్ కుటుంబానికి వెయ్యి కోట్లు వచ్చాయి. దాదాపు రెండు ఎకరాల భూమిని కల్వకుంట్ల శైలిమ, ఎలమంచిలి సుస్మా శ్రీకి సర్కార్ రెగ్యూలరైజ్డ్ చేసింది. ఎన్నికల అఫడవిట్‌‌లో తెలియకుండా శ్రీధర్ రూ.7 కోట్ల రూపాయలను కేటీఆర్ సతీమణి శైలిమకు ఇచ్చినట్లు చూపించాలి. పంచ భూతాల్లా శ్రీధర్‌‌తోపాటు మరో నలుగురు ఐఏఎస్‌‌లు పని చేస్తున్నారు. దోపిడీ సొమ్ము వయా శ్రీధర్ నుంచి కేటీఆర్ ఖాతాలోకి వెళ్తుంది. ప్రెస్టీజ్ ప్రాజెక్టు కూడా కేటీఆర్ బినామీనే’ అని రేవంత్ ఆరోపించారు.