సిక్కు విద్యార్ధి తలపాగా తొలగించిన ఇన్విజిలేటర్.. చర్యలు తీసుకోవాలని డిమాండ్

సిక్కు విద్యార్ధి తలపాగా తొలగించిన ఇన్విజిలేటర్.. చర్యలు తీసుకోవాలని డిమాండ్

పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్  ఓ సిక్కు విద్యార్ధి యొక్క తలపాగా ను తొలిగించిన సంఘటన మధ్యప్రదేశ్ లోని థార్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని ధన్మోద్ ప్రభుత్వ హైయర్ సెకండరీ స్కూల్‌లో 12 వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. సోమవారం ఈ పరీక్షకు హాజరైన సిక్కు వర్గానికి చెందిన 12 వ తరగతి విద్యార్థిని చెకింగ్ లో భాగంగా ఇన్విజిలేటర్ తలపాగా తొలగించాడు.  ఈ సంఘటనపై విద్యార్ధి అధికారులకు ఫిర్యాదు చేయడంతో, వారు పరీక్షా కేంద్రం అసిస్టెంట్ హెడ్ ను సంబంధిత విధుల నుండి తొలగించారు.

తాను పరీక్షా హాలులోకి ప్రవేశించేటప్పుడు ఇన్విజిలేటర్ తలపాగా తీసేయబోయాడని, అడ్డుకోవటానికి ప్రయత్నించినా బలవంతంగా దానిని తొలగించాడని విద్యార్ధి సెంటర్ హెడ్‌కు ఫిర్యాదు చేసినట్టు చెప్పాడు. హెడ్ కూడా.. మధ్య ప్రదేశ్ విద్యా మండలి సూచించిన పరీక్షా ప్రక్రియ ఇదేనని చెప్పడంతో..  చేసేదేమీ లేక పరీక్షా హాలుకి వెళ్లానని చెప్పాడు. తనకు చాలా అవమానం జరిగిందని, దాని కారణంగా పరీక్ష కూడా సరిగా రాయలేదని  ఆ విద్యార్ధి ధార్ జిల్లా గిరిజన అభివృద్ధి కమిషనర్ బ్రజేష్ పాండే కు ఫిర్యాదు చేశాడు

బ్రజేష్ పాండే దీనిపై మాట్లాడుతూ..  విద్యార్ధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుగుతోందని, ఇన్విజిలేటర్ చేసిన చర్యలపై ఎంక్వయిరీ చేస్తున్నామని చెప్పారు. విచారణ ముగిసే వరకు, పరీక్షా కేంద్రం అసిస్టెంట్ హెడ్ మమతా చౌరాసియాను సంబంధిత విధుల నుండి తొలగించామని చెప్పారు. ఇదిలా ఉండగా..జిల్లాలోని సిక్కు సమాజం కూడా ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖాధికారులకు ప్రాతినిధ్యం వహించి, విద్యార్థిని తన తలపాగా తొలగించేలా చేసిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

MP: Sikh student forced to take off turban during Class 12 board exam checking, govt orders inquiry