
- రామగుండంలో కాలుష్యం పెరిగిపోయిందని ఆందోళన
- ముంబైలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీటింగ్లో పాల్గొన్న ఎంపీ
గోదావరిఖని, వెలుగు: పబ్లిక్ హెల్త్ను రిస్కులో పెట్టి పరిశ్రమలు అభివృద్ధి చేయకూడదని పరిశ్రమల మేనేజ్మెంట్లకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సూచించారు. సోమవారం ముంబైలో ఎన్టీపీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా నిర్వహించిన మీటింగ్లో ఎంపీ మాట్లాడారు.
రామగుండం ప్రాంతంలో గాలి కాలుష్యం ఏక్యూఐ 200కి మించి ఉందని, దీనివల్ల కార్మికులు, ప్రజలు శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ కేంద్రాల కోసం భూములు కోల్పోయిన కుటుంబాలకు పునరావాసంతో పాటు ఆర్అండ్ఆర్ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఎన్టీపీసీలో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నారు.
ఇటీవలే రామగుండం అక్బర్ నగర్ ప్రాంతంలో పైప్‌లైన్ పేలి బూడిద వెలువడిన ఘటనలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధి పేరుతో ప్రజల ఆరోగ్యం, పర్యావరణం దెబ్బతింటున్నదని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఎంపీ స్పష్టం చేశారు. ప్రజలకు శుభ్రమైన గాలి పీల్చే హక్కు, సురక్షిత వాతావరణంలో జీవించే హక్కును రాజ్యాంగం ఇచ్చిందని గుర్తుచేశారు. పరిశ్రమలు తమ సామాజిక బాధ్యతలో భాగంగా కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
శుభ్రమైన గాలి, సురక్షితమైన పర్యావరణంపై దృష్టి పెట్టాలన్నారు. భూములు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయడం, స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వడం తన మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ సంస్థలు కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల హక్కులు సమానంగా ఒకే దారిలో ముందుకు సాగుతాయని వంశీకృష్ణ వ్యాఖ్యానించారు.