ఎల్​పీసీ ఇవ్వడానికి లంచం డిమాండ్​ 

ఎల్​పీసీ ఇవ్వడానికి లంచం డిమాండ్​ 
  • పంచాయతీ కార్యదర్శి నుంచి రూ.1.4 లక్షలు తీసుకుంటూ చిక్కిన ఆఫీసర్​ 

స్టేషన్​ఘన్​పూర్ : ట్రాన్స్​ఫర్ ​అయిన పంచాయతీ సెక్రెటరీకి ఎల్​పీ సర్టిఫికెట్​ఇవ్వడానికి లంచం డిమాండ్ ​చేసిన జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​ ఎంపీడీఓ ఏసీబీకి చిక్కారు. అవినీతి నిరోధక శాఖ ఆఫీసర్ల కథనం ప్రకారం..స్టేషన్​ఘన్​పూర్​ మండలంలోని శివునిపల్లిలో 2019 నుంచి 2022 వరకు వెంకటకిషోర్​పంచాయతీ సెక్రెటరీగా పని చేశారు. ఈ ఏడాది జనవరిలో హన్మకొండ జిల్లా ఐనవోలుకు బదిలీ అయ్యారు. లాస్ట్​ పే సర్టిఫికెట్​(ఎల్​పీసీ) కోసం ఎంపీడీఓ దేశగాని కుమారస్వామిని అడగ్గా ఆయన రూ.1.4 లక్షలు ఇస్తేనే పని అవుతుందని చెప్పాడు. ఉద్యోగం చేసేచోట సర్టిఫికెట్​ ఇవ్వకపోవడంతో 7 నెలలుగా జీతం రావడం లేదు.

దీంతో వెంకటకిశోర్ ​వరంగల్​లోని ఏసీబీ ఆఫీసర్లను ఆశ్రయించాడు. వారి సూచనల ప్రకారం..సోమవారం హన్మకొండలోని సుమంగళి ఫంక్షన్​హాల్​ వద్దకు చేరుకున్న వెంకటకిశోర్ ఎంపీడీఓ కు ఫోన్​ చేసి డబ్బులు తెచ్చానని చెప్పాడు. దీంతో ఎంపీడీఓ అక్కడికి వచ్చి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ హరీశ్​కుమార్​ఆధ్వర్యంలో ఇన్​స్పెక్టర్లు శ్యాంసుందర్​, శ్రీను రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఎంపీడీఓ సొంత ఊరైన జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతలతో పాటు డ్యూటీ చేసే స్టేషన్ ​ఘన్​పూర్ ​ఆఫీస్,​ హన్మకొండలోని ఇంట్లో మూడు బృందాలు తనిఖీలు చేశాయి. ఎంపీడీఓను హైదరాబాద్​ ఏసీబీ కోర్టుకు తరలించారు.  ఎవరైనా లంచం డిమాండ్​ చేస్తే  9440446146 కు ఫోన్​ చేసి చెప్పాలని, వారి వివరాలు సీక్రెట్​గా ఉంచుతామని ఏసీబీ డీఎస్పీ హరీశ్​కుమార్​ తెలిపారు.