
- పాత కేసు తిరగదోడి అర్ధరాత్రి హైడ్రామా
- పార్టీ మారుతున్నడని చౌటుప్పల్ ఎంపీపీ వెంకట్‌రెడ్డి అరెస్టుకు యత్నం
- పోలీసులతో వాగ్వాదం.. విషయం తెలిసి ఇంటికెళ్లిన బీజేపీ లీడర్లు
- ఈటల సమక్షంలో బీజేపీలో చేరిన వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ నేతలు
నల్గొండ, వెలుగు : చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి ఇంటి వద్ద సోమవారం అర్ధరాత్రి హైడ్రామా జరిగింది. టీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరాలనుకున్న ఆయనపై పాతకేసులు తిరగదోడి పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. వెంకట్‌రెడ్డితోపాటు చౌటుప్పల్ మండలానికి చెందిన మున్సిపల్ చైర్మన్, నాంపల్లి, మర్రిగూడ, నారాయణపూర్ మండలాలకు చెందిన పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు మంగళవారం బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఈ చేరికలను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ నేతలు పోలీసులను రంగంలోకి దింపారు. సోమవారం అర్ధరాత్రి 12 గంటల టైంలో చౌటుప్పల్ ఎస్ఐ సీతం పాండు, ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్‌లోని మన్సూరాబాద్‌లో ఉన్న వెంకట్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. తంగెళ్ల అపార్ట్మెంట్ మూడో ఫ్లోర్‌లోని ఆయన ఫ్లాట్‌ను చుట్టుముట్టారు. అనుమానం రాకుండా ఉండేందుకు వాచ్‌మన్ సాయంతో తలుపుతట్టి బయటకు రప్పించే ప్రయత్నం చేశారు. ఇంత అర్ధరాత్రి టైంలో ఏం పని అని వాచ్‌మన్‌ను గట్టిగా నిలదీయడంతో పోలీసులు వచ్చారని చెప్పాడు. తనను అరెస్ట్ చేసేందుకు అర్ధరాత్రి ఎందుకు వచ్చారని వెంకట్‌రెడ్డి పోలీసులను అడిగారు. నీకు టైం చెప్పి రావాలా? అని తను, కుటుంబ సభ్యుల పట్ల దురుసుగా మాట్లాడారని చెప్పారు. వారెంట్ ఇవ్వాలని అడిగితే లేదన్నారని చెప్పారు. గంటకు పైగా ఇంటివద్ద వెయిట్ చేసిన పోలీసులు చివరకు కిటికీలోంచి నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారన్నారు.
అండగా నిలిచిన బీజేపీ నేతలు
పోలీసుల హైడ్రామా విషయం ఫోన్ ద్వారా తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, అశ్వత్థామరెడ్డి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలతో వెంకట్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయాక వెంకట్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యులను రహస్య ప్రదేశానికి తరలించారు. మంగళవారం పొద్దునే మళ్లీ పోలీసులు వెంకట్‌రెడ్డి అపార్టమెంట్ పరిసరాల్లో నిఘా పెట్టారు. ఆయన బయటికి వస్తే అరెస్ట్ చేయాలనుకున్నారు. ఆయన అప్పటికే ఇంట్లోంచి బయటకెళ్లాడని తెలుసుకున్న పోలీసులు అక్కడి వెళ్లిపోయారు.
కూసుకుంట్లను వద్దన్నందుకే...
మునుగోడు టీఆర్ఎస్అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించొద్దని నియోజకవర్గంలోని ఆయన వ్యతిరేక వర్గం నేతలు ఈ నెల 12న ఆందోళ్‌మైసమ్మ టెంపుల్ సమీపంలో మీటింగ్ పెట్టారు. తమ ఆదేశాలు ధిక్కరించి మీటింగ్ పెట్టడాన్ని సీరియస్‌గా తీసుకున్న హైకమాండ్ కూసుకుంట్ల వ్యతిరేకులు, అసంతృప్తుల కదలికలపై నిఘా పెట్టింది. అసంతృప్త నేతల్లో వెంకటరెడ్డి ముఖ్యమైన వ్యక్తి కావడంతో నాలుగు రోజులుగా పోలీసులు, ఇంటిలిజెన్స్ ఆయన కదలికలను పసిగడుతున్నారు. ఈనెల 15న చౌటుప్పల్ ఎంపీపీ ఆఫీసులో జెండా ఎగురవేయడానికి వచ్చిన వెంకటరెడ్డిని తుఫ్రాన్పేటకు చెందిన రైతులు అడ్డుకున్నారు. తుఫ్రాన్ పేటలో ఓ భూమి విషయంలో వివాదం నడుస్తోంది. ఈ కేసు కోర్టులో ఉండగానే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రైతులను రెచ్చగొట్టి తన మీదకు తోలారని వెంకట్‌రెడ్డి ఆ తర్వాత మీడియాకు తెలిపారు. ఇది జరిగాక వెంకట్రెడ్డిబీజేపీలో చేరేందుకు ఆ పార్టీ నేతలను కలిసేందుకు హైదరాబాద్ వెళ్లిపోయారు. విషయం తెలిసిన అధికార పార్టీ నేతలు అదే రోజు అర్ధరాత్రి వెంకట్‌రెడ్డిని అరెస్ట్ చేయించాలని ప్లాన్ వేశారు.
సర్పంచ్‌లు, స్థానిక నేతలకు వార్నింగ్
వెంకట్‌రెడ్డితోపాటు పార్టీ మారేందుకు సిద్ధమైన స్థానిక ప్రజాప్రతినిధులను కట్టుదిట్టం చేసేందుకు జిల్లా టీఆర్ఎస్ నేతలు మంగళవారం రోజంతా కష్టపడ్డారు. చౌటుప్పుల్ మండల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మున్సిపల్ నేతలకు టీఆర్ఎస్ లీడర్ల నుంచి ఫోన్లు చేశారు. కానీ స్థానిక నేతలెవరు ఫోన్లలో రెస్పాండ్ కాకపోవడంతో చివరకు మండల పార్టీ నాయకులను వారి ఇండ్లకు పంపి మంత్రిగారు తీసుకురమ్మంటున్నారని చెప్పి చౌటుప్పల్‌కు తీసుకొచ్చారు. అక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ లో ప్రజాప్రతినిధులకు పార్టీ మారకుండా గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ‘సర్వేలన్నీ టీఆర్ఎస్ వైపే ఉన్నాయి. సర్పంచ్ లు ఎవరూ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, మీ సమస్యలేం ఉన్నా నేరుగా మాకు చెప్పండి. రెండు రోజులకోసారి ఈ నియోజకవర్గంలో తిరుగుతం” అని పార్టీ వారు చెప్పినట్లు సర్పంచ్‌లు తెలిపారు. రేషన్ కార్డులు, పింఛన్లు సర్పంచుల చేతుల మీదుగానే ఇచ్చేట్టు చూడాలని, గ్రామాల్లో రోడ్లు, అభివృద్ధి పనులు చేయాలని కోరగా బహిరంగ సభ తర్వాత చేయిస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పుడు ఏ పని చేసినా ఎన్నికల గురించే అనుకుంటారని, మనకు ఎక్కడ ప్లస్ అవుతుందో అక్కడ పనులు చేయించుకోవాలని సూచించారన్నారు.
పాత కేసు తెరపైకి..
జులై18న ఓ వెంచర్ రోడ్డు విషయంలో జరిగిన వివాదంలో అదే నెల 20న వంగ జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ కేసు నమోదు అయిన విషయం కూడా తనకు తెలియదని వెంకట్రెడ్డితెలిపారు. పార్టీ మారుతున్నాననే తనపై మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కుట్రపన్నారని పేర్కొన్నారు. అధికార బలంతో పోలీసులచే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు.
అక్రమ కేసులకు భయపడను: తాడూరి వెంకట్‌రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను తప్పనిసరిగా ఓడించి బీజేపీ జెండా ఎగురవేస్తామని తాడూరి వెంకట్‌రెడ్డి చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తమపై అక్రమ కేసులు పెట్టి బెదిరించాలని చూస్తున్నారని ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి తాను టీఆర్ఎస్లో చేరానని, కానీ ఎలాంటి నిధులు ఇవ్వలేదన్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ తీరు నచ్చకనే బీజేపీలో చేరినట్లు చెప్పారు.
బీజేపీలో చేరిన వెంకట్‌రెడ్డి..
చౌటుప్పుల్ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ పెద్దింటి బుచ్చి రెడ్డి, కంది లక్ష్మారెడ్డి తదితరులు మంగళవారం పార్టీ చేరికల కమిటీ చైర్మ న్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో హైదరాబాద్‌లో బీజేపీలో చేరారు.