రైతులు వాణిజ్య పంటలు సాగు చేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

 రైతులు వాణిజ్య పంటలు సాగు చేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
  • కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నల్గొండ అర్బన్, వెలుగు : వరికి ప్రత్యామ్నాయంగా అధిక దిగుబడినిచ్చే వాణిజ్య పంటలను రైతులు సాగు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి  సూచించారు. సోమవారం నల్గొండలోని దండంపల్లి గ్రామంలో రైతు సంకినపల్లి వెంకటరెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో 12.5 ఎకరాల విస్తీర్ణంలో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్​లో మొదటి మొక్కను కలెక్టర్ నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయిల్ పామ్ మొక్కను ఒకసారి నాటితే నాలుగేండ్ల తర్వాత నిర్విరామంగా 30 ఏండ్ల వరకు ఎకరానికి 10 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుందన్నారు.

 ఎకర సాగుకు రూ.లక్షా 20 వేల నుంచి రూ.లక్షా 70 వేల వరకు నికర ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. ఆయిల్ పామ్ పంటకు జంతువులు, దొంగల నుంచి ఎలాంటి బెడద ఉండదని చెప్పారు. ఆయిల్ పామ్ వేసిన రైతు ప్రతి నెలా ఆదాయాన్ని తీసుకొనే సౌకర్యం ఉంటుందన్నారు. ఈ మొక్కలు ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకుంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి పిన్నపురెడ్డి అనంతరెడ్డి, పతంజలి ఫుడ్స్ జిల్లా జనరల్ మేనేజర్ యాదగిరి, ఉద్యాన అధికారులు, ఆయిల్ పామ్ కంపెనీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.