
- ఖమ్మం కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ కు 100 వినతులు
- ప్రజావాణిలో అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్
ఖమ్మం టౌన్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ మీటింగ్ హల్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వంద వినతులు వచ్చాయి.
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాలని, భూభారతి, గురుకులలో సీట్ల కేటాయింపు కోసం అధికంగా వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమాన్నిఅధికారులు అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలన్నారు. ప్రజావాణి లో డీఆర్వో ఏ. పద్మశ్రీ, డీఆర్డీఓ సన్యాసయ్య పాల్గొన్నారు.
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లో సోమవారం అడిషనల్ కలెక్టర్ డి. వేణుగోపాల్ గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల వద్ద నుంచి ఆఫీసర్లు దరఖాస్తులు స్వీకరించారు. భూమి పట్టా కోసం ఏడేండ్లుగా దరఖాస్తులు చేసుకుంటూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయిందని దమ్మపేట మండలం చిల్లగుంపు గ్రామానికి చెందిన సున్నం నాగమణి అడిషనల్కలెక్టర్ డి. వేణుగోపాల్ఎదుట వాపోయారు.
చర్ల మండలం అంబేద్కర్‌నగర్‌కు చెందిన తండ్రి చింతల భాస్కర రావుకు చెందిన ఆరు ఎకరాల భూమిని ఎవరికి తెలియకుండా తమ అన్న ఆయన పేరు మీదు పట్టా చేయించుకున్నారని, సెంటు భూమి కూడా ఇవ్వలేదని ఇద్దరు సోదరులు వినతిపత్రం అందజేశారు.