బీఆర్ఎస్ చలో పూసగూడెం ఉద్రిక్తత

బీఆర్ఎస్ చలో పూసగూడెం ఉద్రిక్తత
  • పాల్వంచలో బీఆర్ఎస్ నాయకుల అరెస్టు

పాల్వంచ, వెలుగు:  సీతారామ ప్రాజెక్టు నీటిని మొదట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇచ్చిన తర్వాతనే వేరే జిల్లాలకు తరలించుకుపోవాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం పూసుగూడెంకు పిండ ప్రదానం చేసేందుకు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు.  వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, రాఘవేంద్రరావు ర్యాలీగా రాగా పోలీసులు వారిని పాల్వంచ కుంటి నాగుల గూడెం వద్ద అడ్డగించారు. దీంతో పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. 

ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు బారికేడ్లు తొలగించి ముందుకు వెళ్లేందుకు యత్నించారు. ఉద్రిక్తతల మధ్య నాయకులను పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. వనమా రాఘవేంద్రరావును  పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. బీఆర్ఎస్ మహిళా నాయకురాలు బట్టు మంజుల పోలీసు వాహనాన్ని అడ్డగించి నిరసన తెలిపారు.  అనంతరం పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. రెండు గంటల తర్వాత వారిని పోలీసులు విడుదల చేశారు.  

ఈ సందర్భంగా బీఆర్‌‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టు నుంచి భద్రాద్రి కొత్తగూడెంకు నీరు వచ్చే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు.  కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.