యశోద హాస్పిటల్​లో.. ఎంఆర్ లినాక్ మెషిన్

యశోద హాస్పిటల్​లో.. ఎంఆర్ లినాక్ మెషిన్
  • దేశంలోనే మొదటిసారి అందుబాటులోకి.. 
  • క్యాన్సర్ ట్రీట్​మెంట్​లో కొత్త టెక్నాలజీ 

మాదాపూర్, వెలుగు: క్యాన్సర్ ట్రీట్​మెంట్​లో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. కీలకమైన ఎంఆర్ లినాక్ రేడియేషన్​ టెక్నాలజీని దేశంలోనే మొదటిసారి హైదరాబాద్ హైటెక్​ సిటీలోని యశోద హాస్పిటల్​లో అందుబాటులోకి తెచ్చారు. మంగళవారం ఆస్పత్రిలో ముంబై టాటా మెమోరియల్ హాస్పిటల్ డైరెక్టర్ సీఎస్​ ప్రమేశ్, యశోద హాస్పిటల్ ఎండీ డాక్టర్ జీఎస్​రావు ఎంఆర్ లినాక్ మెషిన్​ను ప్రారంభించారు. క్యాన్సర్​లో వస్తున్న సవాళ్లను అధిగమించేందుకు ఎంఆర్ లినాక్ మెషిన్ ఎంతో ఉపయోగపడుతుందని ప్రమేశ్ అన్నారు. దీన్ని యశోద హాస్పిటల్ అందుబాటులోకి తేవడం అభినందనీయమన్నారు. క్యాన్సర్​ను మొదటి దశలోనే గుర్తించినా, దాన్ని నియంత్రించడం ఎంతో కీలకమని.. దీనిపై ప్రజల్లో మరింత అవగాహన తేవాలని సూచించారు. ఐసీఎంఆర్ అంచనా ప్రకారం 2025 వరకు క్యాన్సర్ బాధితులు 12.8 శాతం పెరగవచ్చని డాక్టర్ జీఎస్ రావు చెప్పారు.

‘‘డబ్ల్యూహెచ్​వో రిపోర్టు ప్రకారం మన దేశంలో 2020లో క్యాన్సర్ కొత్త కేసులు 10 లక్షలకు పైగా ఉన్నాయి. 8 లక్షల క్యాన్సర్​ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. మన దేశంలో ఎక్కువ మంది రొమ్ము, ఊపిరితిత్తులు, నోటి, గర్భాశయ క్యాన్సర్లతో బాధపడుతున్నారు” అని తెలిపారు. క్యాన్సర్ ట్రీట్​మెంట్​టైమ్​లో క్రిస్టల్ క్లియర్ ఇమేజ్ తీయడానికి ఎంఆర్ లినాక్ మెషిన్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దీనితో క్యాన్సర్ ట్యూమర్లను స్పష్టంగా గుర్తించవచ్చని, ట్యూమర్​సెల్స్​ను కచ్చితత్వంతో టార్గెట్​ చేయవచ్చని చెప్పారు. రియల్​టైమ్ అడాప్టివ్ రేడియోథెరపీ, రియల్​టైమ్ ట్యూమర్ మానిటరింగ్ దీని సొంతమన్నారు. కార్యక్రమంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మెడికల్​ డైరెక్టర్ డాక్టర్ టి.సుబ్రహ్మణ్యేశ్వర్ రావు, ఎలెక్టా కంపెనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మణికుందన్​బాలా, యశోద హాస్పిటల్​డైరెక్టర్ డాక్టర్ పవన్ పాల్గొన్నారు.