
- వీటిపైన జీఎస్‌టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గడమే కారణం
- డిష్‌వాషర్ల ధరలు రూ.8 వేల వరకు, రూమ్ ఏసీల ధరలు రూ.4,500 వరకు డౌన్
- సోమవారం నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ: జీఎస్‌టీ రేట్లు తగ్గనుండడంతో హోమ్ అప్లయెన్సెస్ కంపెనీలు ఏసీలు, డిష్‌వాషర్‌లపై ధరలను తగ్గించాయి. దీంతో రూమ్ ఎయిర్ కండిషనర్ల (ఏసీల) ధరలు రూ.4,500 వరకు, డిష్‌వాషర్‌ల ధరలు రూ.8 వేల వరకు దిగొచ్చాయి . వినియోగదారులకు జీఎస్‌టీ తగ్గింపు ప్రయోజనాలను అందించేందుకు ఈ కొత్త ధరలు సోమవారం నుంచి అమలులోకి రానున్నాయి.
ఈ తగ్గింపుతో పండుగ సీజన్‌లో అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధిస్తాయని కంపెనీలు ఆశిస్తున్నాయి. వోల్టాస్, డైకిన్, గోద్రెజ్ అప్లయన్సెస్, పానాసోనిక్, హాయర్ వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే తమ సవరించిన ధరల జాబితాను విడుదల చేశాయి. ఇవి సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వస్తాయి. జీఎస్‌టీ తగ్గింపు ప్రభావంతో డిమాండ్ పెరుగుతుందని అంచనా వేసిన కొన్ని కంపెనీలు, తమ డీలర్లతో కలిసి ముందస్తు బుకింగ్‌లను ప్రారంభించాయి.
వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ ఉందని ఇవి చెబుతున్నాయి. రూమ్ ఏసీలతో పాటు, పెద్ద భవనాలు లేదా చిన్న కమర్షియల్ సెటప్‌ల కోసం రూపొందించిన వేరియబుల్ రిఫ్రిజెరెంట్ వాల్యూమ్ (వీఆర్‌ఎఫ్) ఏసీలు, లైట్ కమర్షియల్ ఏసీలు (కాసెట్ టైప్ స్ప్లిట్ ఏసీలు), టవర్ ఏసీల ధరలు కూడా దిగిరానున్నాయి.
అన్ని రకాల ఏసీల ధరల్లో కోత
గోద్రెజ్ అప్లయన్సెస్ కాసెట్, టవర్ ఏసీలపై రూ.8,550 నుంచి రూ.12,450 వరకు ఎంఆర్‌పీ (మ్యాక్సిమమ్ రిటైల్ ప్రైస్) తగ్గిస్తోంది. స్ప్లిట్ ఇన్‌వర్టర్ ఏసీలపై రూ.3,200 నుంచి రూ.5,900 వరకు తగ్గింపు ఉంది. హాయర్ తన గ్రావిటీ (1.6 టన్ ఇన్‌వర్టర్) ఏసీపై రూ.3,905 తగ్గించి రూ.46,085కి, కినోచి ఏఐ (1.5 టన్ 4 స్టార్) ఏసీపై రూ.3,202 తగ్గించి రూ.37,788కి ధరను సవరించింది.
ఈ నెల ప్రారంభంలో జీఎస్‌టీ కౌన్సిల్ ఎయిర్ కండిషనర్లు, డిష్‌వాషర్‌లపై పన్ను రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. దీంతో ఈ పన్ను ప్రయోజనాలను వినియోదారులకు కంపెనీలు బదలాయిస్తున్నాయి. రూమ్ ఏసీల తయారీదారైన వోల్టాస్ తన ఫిక్స్‌డ్ స్పీడ్ విండో ఏసీ ఎంఆర్‌పీని రూ.42,990 నుంచి రూ.39,590కి, ఇన్‌వర్టర్ విండో ఏసీని రూ.46,990 నుంచి రూ.43,290కి తగ్గించింది.
డైకిన్, ఎల్‌జీ అదే బాటలో
డైకిన్ 1 టన్ 5 స్టార్ ఇన్‌వర్టర్ స్ప్లిట్ ఏసీ ఎంఆర్‌పీను రూ.20,500 నుంచి రూ.18,890కి తగ్గించింది. 1.5 టన్ 5 స్టార్ ఏసీని రూ.73,800 నుంచి రూ.68,020 కి, 1.8 టన్ 5 స్టార్ ఏసీను రూ.92,200 నుంచి రూ.84,980 కి తగ్గించింది. 1 టన్ 3 స్టార్ హాట్, కోల్డ్ ఇన్‌వర్టర్ స్ప్లిట్ ఏసీ ధరను రూ.50,700 నుంచి రూ.46,730కి, 1.5 టన్ 3 స్టార్ హాట్ అండ్ కోల్డ్ ఏసీను రూ.61,300 నుంచి రూ.56,500కి తగ్గించింది.
ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ తన ఎంట్రీ లెవల్ 1 టన్ 3 స్టార్ ఇన్‌వర్టర్ స్ప్లిట్ ఏసీ ధరను రూ.32,890కి తగ్గించింది. జీఎస్‌టీ తగ్గడంతో ధరకు రూ.2,800 కోత పెట్టింది. 1.5 టన్ ఏసీపై రూ.3,600 తగ్గించి రూ.42,390కి, 2 టన్ స్ప్లిట్ ఏసీపై రూ.4,400 తగ్గించి రూ.55,490కి ధరను సవరించింది. పానాసోనిక్ ఇండియా తన 1.5 టన్ విండో ఏసీ ఎంఆర్‌పీను రూ.45,650 నుంచి రూ.42,000కి తగ్గించింది. ఫిక్స్‌డ్ స్పీడ్ స్ప్లిట్ ఏసీ (1 టన్) రూ.46,100 నుంచి రూ.42,400కి, 2 టన్ మోడల్ రూ.69,400 నుంచి రూ.63,900కి తగ్గించింది.
డిష్ వాషర్లపైనా తగ్గిన ధరలు..
డిష్‌వాషర్ తయారీదారులు కూడా ధరలు తగ్గించి జీఎస్‌టీ ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తున్నారు. డిష్‌వాషర్ రంగంలో ప్రముఖ సంస్థ అయిన బీఎస్‌హెచ్ హోమ్ అప్లయన్సెస్ జీఎస్‌టీ తగ్గింపు తర్వాత రూ.8 వేల వరకు ధరలు తగ్గించింది. సోమవారం నుంచి, ఎంట్రీ లెవల్ మోడల్ ధర రూ.49 వేల నుంచి రూ.45 వేలకి, టాప్ ఎండ్ మోడల్ ధర రూ.104,500 నుంచి రూ.96,500కి తగ్గనుంది.
జీఎస్టీ ఫిర్యాదుల కోసం ప్రత్యేక విభాగం
కొత్త జీఎస్టీ రేట్లను అమలు చేయని వాళ్లపై ఫిర్యాదులు చేయడానికి, వాటిని పరిష్కరించడానికి కేంద్రం నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్‌లైన్‌లోని ఐఎన్‌జీఆర్‌ఏఎం పోర్టల్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. జీఎస్టీ కౌన్సిల్ సెప్టెంబర్ 22 నుంచి కొన్ని వస్తువులు, సేవలపై పన్ను రేట్లను తగ్గించింది. దీనికి సంబంధించి వినియోగదారుల నుంచి వచ్చే ప్రశ్నలను, ఫిర్యాదులను పరిష్కరించడానికి ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు వినియోగదారుల వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్స్, ఈ-కామర్స్, ఎఫ్ఎంసీజీ లాంటి వాటిలో జీఎస్టీకి సంబంధించిన ఫిర్యాదులను ఈ పోర్టల్‌లో నమోదు చేయవచ్చు. ఈ ఫిర్యాదులను పరిష్కరించడానికి నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్‌లైన్ కౌన్సెలర్లకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) అధికారులు సెప్టెంబర్ 11న శిక్షణ ఇచ్చారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని సూచించారు.
ఈ హెల్ప్‌లైన్‌కు వచ్చే ఫిర్యాదుల నుంచి డేటాను తీసుకొని దాన్ని సంబంధిత కంపెనీలు, సీబీఐసీ వారికి పంపి చర్యలు తీసుకుంటారు. టోల్‌ఫ్రీ నెంబర్ 1915కు ఫోన్ చేయడం ద్వారా లేదా ఐఎన్‌జీఆర్‌ఏఎం పోర్టల్ ద్వారా 17 భాషల్లో ఫిర్యాదు చేయవచ్చు.