పిక్‌పాకెటర్స్‌ కంటే ధోనీనే స్పీడ్: రవిశాస్త్రి

పిక్‌పాకెటర్స్‌ కంటే ధోనీనే స్పీడ్: రవిశాస్త్రి

న్యూఢిల్లీ: జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్‌కు శనివారం రిటైర్మెంట్ ప్రకటించాడు. 16 ఏళ్ల అద్భుతమైన కెరీర్‌‌కు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో క్రీడా ప్రముఖులతో పాటు ఫిల్మ్ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ధోనీని మెచ్చుకుంటూ పలు విషయాలు మాట్లాడారు. తన నాయకత్వంతో ఇండియన్ క్రికెట్ టీమ్ ముఖ చిత్రాన్ని మార్చినందుకు శాస్త్రి ప్రశంసలు కురిపించాడు. క్రికెట్‌లో ఆల్‌ టైమ్ ఫేవరెట్స్‌లో ధోని ఒకడని కొనియాడాడు.

‘అతడ్ని ఎవరూ రెండో వ్యక్తిగా చూడరు. క్రికెట్‌ను అతడు మార్చేశాడు. అందమైన విషయం ఏంటంటే అన్ని ఫార్మాట్స్‌లోనూ మార్చేయడం. టీ20లో అతడు వరల్డ్‌కప్ గెలిచాడు. ఐపీఎల్‌లో పలు టైటిల్స్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లోనూ ప్రపంచ కప్‌ను అందించాడు. టెస్టు క్రికెట్‌లో టీమ్‌ను నంబర్ వన్ స్థానానికి చేర్చాడు. 90 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. జీవితాన్ని అది వచ్చిన తీరులోనే స్వీకరించాడు. ఖరగ్‌పూర్‌‌లో ఉన్న రోజుల నుంచి ఇండియన్ క్రికెటర్‌‌గా ఉన్న రోజుల వరకు ప్రతి క్షణంలో అతడు ఉన్నాడు. రిటైర్మెంట్‌లోనూ అతడు అలాగే ఉన్నాడు. నేను చెప్పినట్లే అతడు మరొకరికి రెండోవాడు కాదు. వికెట్ కీపర్‌‌గా అతడు సాధారణ కీపర్ కాదు. అదే టైమ్‌లో చాలా ఎఫెక్టివ్‌గా కూడా. అతడు చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. నాకు అతడి స్టంపింగ్స్, రనౌట్స్ చాలా ఇష్టం. అతడి చేతులు అంత త్వరగా, వేగంగా కదులుతాయి. ఆ విషయంలో అతడు పిక్‌పాకెట్‌ కంటే స్పీడ్‌గా ఉంటాడు. ధోని బెయిల్స్‌ను గిరాటేసిన విషయం కూడా బ్యాట్స్‌మెన్‌కు తెలీదు. ఇది అతడి కాలాన్ని సూచిస్తుంది. క్రికెట్ గ్రేటెస్ట్‌ లిస్ట్‌లో అతడ్ని చేర్చాలి’ అని శాస్ర్తి పేర్కొన్నాడు.