
మాజీ ఇండియా లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్
న్యూఢిల్లీ: కెప్టెన్సీ విషయంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ ఇద్దరిదీ విభిన్న వైఖరి అని మాజీ ఇండియా లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ చెప్పాడు. కానీ తమ బాధ్యతలను నిర్వర్తించడంలో మాత్రం వారిద్దరూ చాలా ప్రభావవంతంగా ఉంటారన్నాడు. ‘కోహ్లి, ధోని ఇద్దరూ డిఫరెంట్ కెప్టెన్స్. విరాట్ చాలా అగ్రెసివ్‌గా ఉంటాడు. అలాగే తను ఎక్స్‌ప్రెసివ్ కూడా. కానీ ధోనీది చాలా ప్రశాంతంగా ఉండే తత్వం. ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌ను బట్టి ధోనీని అర్థం చేసుకోవడం కష్టం. అయితే ధోనీని బౌలర్ల కెప్టెన్ అనొచ్చు. విరాట్‌ను సహజమైన, చురుకైన కెప్టెన్ అని పిలవాలి. ఇది అతడికి చాలా ఎనర్జీని ఇస్తుంది. రోజురోజుకూ కోహ్లి మరింత మెరుగవుతున్నాడు. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. బ్యాట్‌తో రన్స్ చేయడంతోపాటు ఎనర్జీతో టీమ్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడు. బౌలర్లకు సంబంధించి అతడి దగ్గర ఎప్పుడూ కొన్ని ఆలోచనలు ఉంటాయి. వైఖరి ముఖ్యమే కానీ అంతిమంగా ఫలితమే కీలకం. విరాట్ మ్యాచ్‌లు ఓడిపోయినా పట్టించుకోడు. ఎందుకంటే మ్యాచ్‌లు గెలవాలనే అతడు ఆడతాడు. 90, 2000వ దశకాల్లో ఆస్ట్రేలియా కూడా అదే చేసింది. అందుకే కంగారూలు అంతగా విజయవంతమయ్యారు. మీరు మ్యాచ్ గెలవడానికి ఆడతారు, ఒకవేళ ఓడిపోయినా అది గేమ్‌లో భాగమే’ అని శివరామకృష్ణన్ పేర్కొన్నాడు.