
న్యూఢిల్లీ: ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో ప్రకటించిన ఈ డెకేడ్ వన్డే, టీ20 టీమ్‌ల్లో మహేంద్ర సింగ్ ధోనీకి కెప్టెన్‌గా చోటు దక్కింది. టెస్ట్‌ల్లో మాత్రం విరాట్ కోహ్లీకి పగ్గాలు అప్పగించింది. 23 మంది సభ్యులతో కూడిన ప్యానెల్ ఈ టీమ్‌లను ఎంపిక చేసింది. 50 టెస్ట్‌లు లేదా ఆరేళ్లు యాక్టివ్ ఇంటర్నేషనల్ క్రికెట్‌ను ఐదు రోజుల ఫార్మాట్‌కు క్రైటీరియాగా తీసుకున్నారు. అదే లిమిటెడ్ ఓవర్స్‌కు వచ్చేసరికి 75 వన్డేలు, 100 టీ20లను ప్రతిపాదికగా ఎంపిక చేశారు. ఆఫ్ స్పిన్నర్ ఆర్. అశ్విన్‌కు టెస్ట్ ఎలెవన్‌లో ప్లేస్ లభించింది. కుక్, విలియమ్సన్ టీమ్‌లో ఉన్నారు. 54.97 యావరేజ్‌తో 7202 రన్స్ చేసిన విరాట్ కోహ్లీకి మూడు ఫార్మాట్లలో చాన్స్ ఇచ్చారు. వన్డేల్లో రోహిత్ శర్మకు చోటు దక్కింది. టీ20 టీమ్‌లో ధోనీతో పాటు కోహ్లీ, బుమ్రా కూడా ఉన్నారు. క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, నరైన్, పొలార్డ్, రసెల్‌ను ఎంపిక చేశారు. మహిళల వన్డే, టీ20 టీమ్‌లో మిథాలీ రాజ్, పేసర్ జులన్ గోస్వామిని చేర్చారు. ఆసీస్ క్రికెటర్ మెగ్ లానింగ్‌ను కెప్టెన్‌గా ప్రకటించారు.