వరికి కనీస మద్దతు ధర 2,441...14 రకాల ఖరీఫ్ పంటల ఎంఎస్ పీలకు.. కేంద్ర కేబినెట్ ఆమోదం

వరికి కనీస మద్దతు ధర 2,441...14 రకాల ఖరీఫ్ పంటల ఎంఎస్ పీలకు.. కేంద్ర కేబినెట్ ఆమోదం
  •   ఏ గ్రేడ్ రకానికి రూ. 2,461
  •   అత్యధికంగా పొద్దుతిరుగుడు ధరపై రూ. 622 పెంపు

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 ఖరీఫ్  సీజన్‌‌కు సంబంధించి 14 రకాల పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర కేబినెట్​ఆమోదం తెలిపింది. ఈ సారి విత్తనాలు నాటడానికి ముందే ఖరీఫ్ పంటలకు ఎంఎస్‌‌పీలను ఆమోదించింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, పంట మార్పిడిని ప్రోత్సహించడమే లక్ష్యంగా 2026–-27 ఖరీఫ్ సీజన్ కోసం వరి కనీస మద్దతు ధరను క్వింటాల్‌‌కు రూ.72 పెంచి రూ.2,441కి చేర్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, పప్పుధాన్యాలు, నూనెగింజలు, పత్తి ధరలను మరింతగా పెంచింది. సాధారణ రకం వరికి మద్దతు ధరను క్వింటాల్‌‌కు రూ. 72 పెంచి రూ. 2,441 గా నిర్ణయించింది. ఏ  గ్రేడ్-రకం వరి ధాన్యం ధరను రూ. 2,461 కు పెంచింది. అలాగే, మధ్యశ్రేణి రకం పత్తికి రూ. 557 పెంచి రూ. 8,267 గా, దీర్ఘశ్రేణి పత్తి ధరను రూ. 8,667 గా ఖరారు చేసింది. ఈ ఏడాది అత్యధికంగా పొద్దుతిరుగుడు ధరపై రూ. 622 పెంచింది. దీంతో క్వింటాల్‌‌ పొద్దుతిరుగుడు గింజల ధర  రూ. 8,343 కి చేరింది. అలాగే, నువ్వులు క్వింటాల్​ధర రూ. 10,346కు, నైగర్ సీడ్ రూ. 10,052, సోయాబీన్ రూ. 5,708, వేరుశనగ రూ. 7,517కు పెంచింది. కందుల ధరను రూ. 450 పెంచి రూ. 8,450గా, మినుములు రూ. 8,200 గా, పెసలు రూ. 8,780 గా నిర్ణయించింది. జొన్నలు (హైబ్రీడ్) ధర రూ. 4,023 గా, మాల్దండి రకం రూ. 4,073 గా నిర్ణయించారు. సజ్జలు రూ. 2,900, రాగులు రూ. 5,205, మొక్కజొన్న రూ. 2,410 కి ధరలను సవరించారు.

ఈ  సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు లాభదాయకమైన ధరలు అందేలా చూసేందుకు పంటల కనీస మద్దతు ధరలను నిర్ణయించామని తెలిపారు. ఖరీఫ్ పంటల మద్దతు ధరలు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50 శాతం అధికంగా ఉండేలా నిర్ణయించినట్టు తెలిపారు.

ఈ మద్దతు ధరల వల్ల రైతులకు సుమారు రూ. 2.60 లక్షల కోట్ల చెల్లింపులు జరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే, ఖరీఫ్​ సీజన్లో 824.41 లక్షల టన్నుల పంటను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నూనెగింజల ఎంఎస్​పీ పెంపును ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్ దేశాయ్ స్వాగతించారు. అంతర్జాతీయ ధరలకు తగ్గట్టుగా స్థిరమైన దిగుమతి సుంకాల విధానం ఉండాలన్నారు.
అహ్మదాబాద్, ధోలేరా మధ్య కొత్త రైల్వే లైన్​గుజరాత్‌‌లో అహ్మదాబాద్, ధోలేరా మధ్య 134 కిలోమీటర్ల పొడవైన సెమీ హైస్పీడ్ డబుల్ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ. 20,667 కోట్లు. ఇది పూర్తిగా భారత్ స్వయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతతో నిర్మిస్తున్న భారతీయ రైల్వేల మొట్టమొదటి సెమీ హైస్పీడ్ కారిడార్. ఈ మార్గంలో రైళ్లు గంటకు 200 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. ఈ లైన్‌‌ను నాలుగేండ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అశ్విని వైష్ణవ్ చెప్పారు.


నాగ్‌‌పూర్ ఎయిర్​పోర్ట్​ అప్​గ్రేడ్​కు గ్రీన్ సిగ్నల్ నాగ్‌‌పూర్ విమానాశ్రయాన్ని పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌‌షిప్ (పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేసి, ఆధునీకరించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు విమానాశ్రయ భూమి లీజు గడువును పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) భూమిని మిహాన్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్) కు కేటాయించిన లీజు గడువును ఆగస్టు 6, 2039 తర్వాత కూడా పొడిగించేందుకు కేబినెట్ అంగీకరించింది.