వెలుగు ఓపెన్ పేజీ..తెలంగాణ ధిక్కార స్వరం మన ముచ్చర్ల!

వెలుగు ఓపెన్ పేజీ..తెలంగాణ ధిక్కార స్వరం మన ముచ్చర్ల!

సంగంరెడ్డి సత్యనారాయణ. ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు. కానీ, ముచ్చర్ల సత్యనారాయణ.. ఈ పేరు మాత్రం తెలంగాణ పాత తరం వారందరికీ సుపరిచితం. తెలంగాణ తొలి ధిక్కార స్వరం ఆయన.  తొలి, మలి దశ  ఉద్యమకారుల కన్నా  ముందే  తెలంగాణ కోసం గొంతెత్తిన స్వరం అది.  ఆంధ్రాతో  తెలంగాణను  కలపటమంటేనే  అది  తెలంగాణ  గొంతు కోయటమని  గుర్తించి ఆనాడే  గళమెత్తిన తొలి ఉద్యమకారుడు ముచ్చర్ల సత్యనారాయణ.  తెలంగాణ ఉద్యమం అంటే చాలామందికి  తొలి,  మలి దశ ఉద్యమాలే గుర్తుకొస్తాయి.

  కానీ,  అంతకన్నా ముందే  తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన గొప్ప వ్యక్తి ముచ్చర్ల సత్యనారాయణ.  తన ఉద్యమ పంథాను ఆయన సరళమైన పాట రూపంలో  ఎంచుకొన్నారు.  సాయుధ  రైతాంగ పోరాటంలో 'బండి వెనుక బండి కట్టి' లాంటి ఎన్నో పాటలు జన బాహుళ్యంలో ఎంతగా ప్రసిద్ధి చెందాయో అందరికీ తెలిసిందే.  అదే తరహాలో  ప్రజా బాహుళ్యంలోకి విస్తృతంగా  వెళ్లాలంటే  అది పాట ద్వారానే సాధ్యమని ఆయన భావించారు. 

అందుకే  తెలంగాణ  భాష,  యాసలతో  నేరుగా  ప్రశ్నించేవిధంగా ఎన్నో సరళమైన పాటలను రాశారు.  ఆంధ్రాతో  తెలంగాణ  విలీనం నుంచి  తెలంగాణకు  అణువణువునా జరుగుతున్న  అన్యాయంపై  ఆయన రాసిన పాటలు ఆంధ్రా పాలకులకు తూటాలై తగిలినయ్. 

ముచ్చర్ల సత్యనారాయణ  రాసిన 

'అయ్యాయ్యో సంజీవ రెడ్డి మామా' అనే పాట ఆనాటి ఉద్యమంలో ఆంధ్రా పాలకుల గుండెల్లో గుబులు పుట్టించింది. ఆంధ్రాతో  తెలంగాణను కలిపే విషయంలో  తెలంగాణ  కమ్యూనిస్ట్ లీడర్లు కూడా  స్వార్థపరులుగా  మారిపోయారంటూ  ఆయన  అప్పుడే  ఆవేదన వ్యక్తం చేశారు.  తెలంగాణకు జరిగిన, జరగబోయే  అన్యాయంపై  విద్యార్థి  నాయకుడిగా  ఉన్నప్పుడే  ఎన్నో పాటలు రాశారు. వాగ్గేయ, జానపద కళాకారుడైన  ముచ్చర్ల సత్యనారాయణ జన కళాకారుడిగా మారారు.  ఆ రోజుల్లో  ఆయన రాసిన పాటల ప్రభావమే తొలి, మలి దశ ఉద్యమాల్లో  పాటకు  ప్రాచుర్యం పెరిగేలా చేసింది. 

తన గ్రామం పేరునే ఇంటి పేరుగా...

వరంగల్ జిల్లాలోని  ముచ్చర్లలో  యాదవ  సామాజిక వర్గంలో  ఆయన  జన్మించారు.  'పచ్చని చెట్లపై   రెప రెపలాడంగ... పాడిపంటలు ఇచ్చి కడుపునింపే  చల్లని  మా తల్లి ముచ్చర్ల'  అంటూ  తన గ్రామం  పేరుపై  పాట రాశారు. ఆ తర్వాత  తన గ్రామం పేరునే  ఇంటి పేరుగా చేసుకున్నారు.  ఆంధ్రాతో తెలంగాణ విలీనం ద్వారా  జరిగే  మోసాన్ని ముందే ఊహించారు. ‘తెలంగాణ  సోదరా తెలుసుకోరానీ బతుకు,   మోసపోకురా,  గోస పడుతవురా’ అంటూ జరిగే  మోసాన్ని పాట రూపంలో హెచ్చరించారు.  

తాను ఊహించినట్లుగానే ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం  ఏర్పడిన  తర్వాత  పెద్ద మనుషుల ఒప్పందాన్ని,   రక్షణ  సూత్రాలను యధేచ్ఛగా  ఉల్లంఘించారు.  దీంతో  'సంజీవరెడ్డి మామ.. సంజీవరెడ్డి మామ... చోడోజీ  తెలంగాణ..  చలో జావో రాయలసీమ' అంటూ పాట ద్వారా  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆ తర్వాత వెల్లువెత్తిన 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో ఈ పాట రణ నినాదమైంది.  నాన్ ముల్కీ ఉద్యమానికి  సాహిత్య  ప్రాణం  పోసిన  తొలి విద్యార్థి మేధావి కూడా  ముచ్చర్ల  సత్యనారాయణ.  

ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేలా....

తెలంగాణ యాస,  భాషలతో  సరళమైన పాటల్ని రాసి  నాన్  ముల్కీ  ఉద్యమాన్ని  ఆంధ్రా వ్యతిరేక ఉద్యమంగా  మలిచారు.  నాన్  మిలిటెంట్  నాన్ ముల్కీ  వ్యతిరేక ఉద్యమంలో  పాపులర్ గా  నిలిచారు.  ఒక గొల్ల వ్యక్తి తనను పైజామా  అంటాడా అంటూ ఏకంగా  ఆనాటి ముఖ్యమంత్రి  సంజీవరెడ్డియే  పరువునష్టం  దావా వేస్తా  అనేలా  పరిస్థితి తీసుకొచ్చారు.  ఇలా  చెప్పుకుంటూపోతే  ఆయన  తెలంగాణ  ఉద్యమ  భావజాల వ్యాప్తి,  ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేలా ఎన్నో  కార్యక్రమాలు చేశారు.  

ఆంధ్రా  నాయకులు చేస్తున్న  అన్యాయాన్నే కాకుండా  తెలంగాణ  నాయకులు కూడా వారి  అన్యాయాన్ని  ప్రశ్నించకపోవటాన్ని ముచ్చర్ల సత్యనారాయణ గట్టిగా నిలదీసేవారు. మర్రి  చెన్నారెడ్డి లాంటి  నాయకుడిని  కూడా  తీవ్రంగా  విమర్శిస్తూ  పాటలు రాశారు.  1969  ఉద్యమంలో  రాజకీయ  నాయకత్వం  లేకుండా  ఉద్యమం  గెలుపొందదని  ఆయన  గ్రహించారు. ఆ ఉద్యమానికి దూరంగా ఉన్న మర్రి చెన్నారెడ్డిని ఉద్యమంలోకి ఆహ్వానిస్తూ ‘రావోయి రావోయి మర్రి చెన్నారెడ్డి, ఇకనైన రావేమీ వెర్రి చెన్నారెడ్డి’ అంటూ పాట ద్వారా పిలుపునిచ్చారు.  

ఆయనను  ఉద్యమంలోకి రావాలంటూ పాటలు రాశారు. 1970లో  తెలంగాణ ప్రజాసమితి  హన్మకొండకు అధ్యక్షుడు అయ్యారు.  1983లో  ఎన్టీఆర్  పార్టీలో  చేరి  ఎమ్మెల్యే కావటంతోపాటు మంత్రి కూడా అయ్యారు. అయినా సరే,  ఆయన తెలంగాణ కోసమే పోరాటం చేశారు. టీఆర్ఎస్​లోనూ చేరి  తెలంగాణ  కోసం  ఫైట్ చేశారు. 2016లో ఆయన చనిపోయేవరకూ  తెలంగాణ కోసమే శ్వాసించారు. 

 ముచ్చర్ల ధిక్కార స్వభావమే స్ఫూర్తి

మలి దశ  తెలంగాణ  ఉద్యమానికి  బీసీ బిడ్డ  అయిన  ముచ్చర్ల  సత్యనారాయణ  ఆనాటి  ధిక్కార  స్వభావం  కూడా  స్ఫూర్తిగా నిలిచింది.  ఆ రోజుల్లోనే  ఆంధ్రా  నాయకత్వాన్ని ఎదిరించి  నిలబడటమంటే  మాటలు కాదు. కానీ,  ముచ్చర్ల  సత్యనారాయణ  ఏమాత్రం  భయపడకుండా  ఆంధ్రా నాయకులను  గట్టిగా నిలదీశారు.  అదేవిధంగా  ఆంధ్రాలో  తెలంగాణ విలీనం,  ఆ విలీనానికి ఇక్కడి నాయకులు అంగీకరించటమంతా కులాల కుట్రలేనని ముచ్చర్ల  చెప్పేవారు.

 తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు  అమాయకులు కావటంతో అగ్రకులాల వాళ్లు అధికారంలోకి  వచ్చారని ఆయన చెబుతుంటారు.  కానీ,  దురదృష్టమేమిటంటే ఇక్కడ అధికారంలోకి వచ్చిన అగ్రకులాలు కూడా  ఆంధ్రా నాయకులకు  గులాంగిరి చేసేవారని ఆవేదన వ్యక్తం చేశారు.  ముచ్చర్ల  సామాజిక  తెలంగాణ కావాలని ఆనాడే  కోరుకున్నారు.  ఆంధ్రాలో  మాదిరిగా  తెలంగాణలో  కులాల  కుంపట్లు ఉండొద్దని ఆయన భావించారు.  తెలంగాణ  ఏర్పాటు అయితే  అది  సామాజిక తెలంగాణ  కావాలని  ఆయన  కలలు కన్నారు. 

 అన్ని వర్గాలకు  రాజకీయంగా  అవకాశాలు  రావాలని  గట్టిగా  కాంక్షించేవారు.  కానీ,  దురదృష్టవశాత్తు తెలంగాణ  సాధించుకున్న  తర్వాత  సబ్బండ వర్గాలకు మేలు జరగకపోగా... ఉమ్మడి ఆంధ్రా పాలనలో ఏవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మోసపోయారో ఇప్పుడూ అదే పరిస్థితి ఉంది. ముచ్చర్ల సత్యనారాయణ కోరుకున్న సబ్బండ వర్గాల తెలంగాణ ఇది కాదు.  బీఆర్ఎస్, కాంగ్రెస్  రెండు ప్రభుత్వాలు కూడా  తెలంగాణ  ఏర్పాటు లక్ష్యాన్ని  నీరుగారుస్తున్నాయి.  అందుకే,  జాగృతి  ముచ్చర్ల సత్యనారాయణని  స్ఫూర్తిగా తీసుకుంది. 

నేడు ముచ్చర్ల సత్తన్న జయంతి.. 
సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా..

ముచ్చర్ల  కలలు  కన్నట్లుగా  సామాజిక  తెలంగాణ సాధనే  లక్ష్యంగా  జాగృతి ముందుకు  కదులుతోంది.  ఆ ప్రక్రియలో  భాగంగానే  బీసీలకు  స్థానిక సంస్థల  ఎన్నికల్లో 42 శాతం  రిజర్వేషన్ల కోసం  జాగృతి  పట్టుపట్టింది.  అదేవిధంగా  పార్టీ  పదవుల్లో  బీసీలకు  ప్రాధాన్యం ఇస్తోంది.  అన్ని రాజకీయ  పార్టీలు  కూడా  బీసీలకు  తగిన  ప్రాధాన్యం  ఇచ్చేలా  ఒత్తిడి పెంచుతోంది.  భవిష్యత్​లోనూ  సామాజిక  తెలంగాణ  సాధించి  సబ్బండ వర్గాలకు మేలు చేయటమే  లక్ష్యంగా  జాగృతి  పనిచేస్తోంది.   

కానీ,  దురదృష్టమేమిటంటే  ముచ్చర్ల  స్ఫూర్తిని  కాంగ్రెస్,  బీఆర్ఎస్  గౌరవించటం  లేదు.  ముచ్చర్లకు  దక్కాల్సినంత  గుర్తింపును  ఆయా పార్టీలు  ఆయనకు  కల్పించలేదన్నది వాస్తవం.  ఈ విషయంలో  బీఆర్ఎస్,  కాంగ్రెస్  దొందూ దొందే.  ఒకరు ఎక్కువ,  ఒకరు  తక్కువ కాదు.  తెలంగాణ  రాష్ట్ర  సాధన  తర్వాత  కూడా ఉద్యమ  నాయకులను  గౌరవించుకోకపోవటం  సిగ్గుచేటు.  వెంటనే ముచ్చర్ల సత్యనారాయణ  విగ్రహాన్ని  ట్యాంక్ బండ్​పై  ఏర్పాటు చేస్తూ  ఆయనను  గౌరవించాలని  ఈ  ప్రభుత్వాన్ని  డిమాండ్  చేస్తున్నా.   

గత  ప్రభుత్వంలో  ఉద్యకారులకు  అన్యాయం  జరిగిందన్నది  వాస్తవం.  అదే విషయాన్ని ఎన్నికల ముందు  పదే పదే  ప్రస్తావించిన  కాంగ్రెస్  పార్టీ ఇప్పుడు  ఎవరికి  న్యాయం  చేస్తోంది?  తొలితరం  ఉద్యమకారులైన  ముచ్చర్ల సత్యనారాయణకి  ఈ  ప్రభుత్వం  ఏం గౌరవం ఇచ్చింది?   వెంటనే  ముచ్చర్ల  విగ్రహాన్ని ట్యాంక్ బండ్​పై ఏర్పాటు చేయాలి.  ఆయన  గౌరవార్థం  ప్రభుత్వంలోని  ఏదైనా  ప్రాజెక్ట్​కు  ఆయన పేరు పెట్టాలి.   అదేవిధంగా  ఆ  మహనీయుడి  చరిత్ర  భవిష్యత్ తరాలకు  తెలియజేసే  బాధ్యత  ప్రభుత్వం తీసుకోవాలి.

- కల్వకుంట్ల కవిత, అధ్యక్షురాలు, తెలంగాణ జాగృతి,మాజీ పార్లమెంట్ సభ్యురాలు