Reliance: ట్రంప్‌తో అంబానీ సీక్రెట్ మీటింగ్..! దోహాలో కలయిక..

Reliance: ట్రంప్‌తో అంబానీ సీక్రెట్ మీటింగ్..! దోహాలో కలయిక..

Trump-Mukesh Ambani: ప్రస్తుతం చాలా దేశాధినేతలు, ప్రభుత్వ ప్రతినిధులు ట్రంప్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. చూడటానికి కామెడీగా ఉన్నట్లు కనిపించే ట్రంప్ నిర్ణయాలు మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటారని గత నెలలో ప్రకటించిన వాణిజ్య సుంకాలు నిరూపించాయి. ఇప్పటికే చైనాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్న అమెరికా త్వరలోనే ఇండియాతో కూడా ఒప్పందం ప్రకటించనుందని తెలుస్తోంది. 

కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తన బృందంతో చర్చల కోసం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో భారత బిలియనీర్.. ఆయిల్ నుంచి టెలికాం వరకు అనేక వ్యాపారాలను నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఖతార్ ఎమిర్ ను దోహాలో కలవనున్నారని వెల్లడైంది. ఈ రెండు దేశాలతో వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకునేందుకే అంబానీ మీటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. 

పైగా ఖతార్ సావరిన్ వెల్త్ ఫండ్ అనేక సంవత్సరాలుగా అంబానీకి చెందిన రిలయన్స్ వ్యాపారాల్లో ముఖ్యమైన పెట్టుబడిదారుల్లో ఒకటిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అలాగే మరోపక్క అమెరికాకు చెందిన గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజాలు సైతం రిలయన్స్ ఇండస్ట్రీస్ తో వ్యాపార భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. అందుకే అంబానీ దోహాలోని లుసైల్ ప్యాలెస్ వేదికగా జరుగుతున్న విందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ను కలవనున్నట్లు వెల్లడైంది. అయితే ఇది కేవలం మర్యాదపూర్వకంగా కలవటమేనని, వ్యాపారానికి సంబంధించి ఎలాంటి చర్చలు ఉండబోవని విషయం తెలిసిన వ్యక్తులు చెబుతున్నారు. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా అంబానీ పర్యటనపై ఎలాంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు. ఫిబ్రవరిలో, ఖతార్ ఎమిరిటస్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థాని భారతదేశాన్ని సందర్శించారు. అలాగే ట్రంప్ గురువారం ఖతార్ నుంచి యూఏఈకి వెళ్లనున్నారు. ప్రస్తుత పర్యటనలో ట్రంప్ పూర్తి ఫోకస్ వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవటంపైనే కొనసాగుతోందని తెలుస్తోంది.