నగరంపై ముఖేశన్నముద్ర

నగరంపై ముఖేశన్నముద్ర

సీనియర్ నేత, మాజీ మంత్రి మూల ముఖేశ్​ గౌడ్ సిటీపై చెరగని ముద్ర వేశారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలను జనం యాది చేసుకుంటున్నారు. మొదటిసారి ఎంసీహెచ్ కు కార్పొరేటర్ గా ఎన్నికై ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. మహరాజ్ గంజ్, గోషామహల్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. లోధ్​ కులస్తులకు బీసీ హోదా వచ్చేలా కృషిచేశారు. వారికి రుణాలు ఇప్పించిన ఘనత కూడా ఆయనదే. సమైక్య రాష్ట్రంలో వైఎస్సార్​ హయాంలో మంత్రిగా పనిచేశారు.  

రంగారెడ్డి, వెలుగు: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేశ్ గౌడ్‌‌ (60) సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఆదివారం రాత్రి విషమించడంతో జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ లో చేర్పించారు. అక్కడ వెంటిలేటర్ పై ఉంచి ఆయనకు చికిత్స అందించారు. అపోలో హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖేశ్​గౌడ్ తుదిశ్వాస విడిచారు. ఆయనకి భార్య లక్ష్మి, కుమారులు విక్రమ్ గౌడ్, విశాల్ గౌడ్, కుమార్తె శిల్ప ఉన్నారు. ముఖేశ్ గౌడ్ మరణ వార్త విని గోషామహల్ సెగ్మెంట్ లోని ఆయన అభిమానులు, కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు.

1959 జులై 1న జన్మించిన ముఖేశ్ గౌడ్ 1986లో  జాంబాగ్ నుంచి  కార్పొరేటర్ గా గెలుపొందారు. 1989లో తొలిసారి మహారాజ్ గంజ్ నుంచి ఎమ్మెల్యే గా విజయం సాధించారు. 2004లో మరోసారి అదే సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008లో అసెంబ్లీ పునర్విభజనలో భాగంగా ఏర్పడిన గోషామహల్ సెగ్మెంట్ నుంచి 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన ముఖేశ్ గౌడ్ రెండు సార్లు మంత్రి పదవి చేపట్టారు. 2007లో ఉమ్మడి ఏపీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా తొలిసారి మంత్రి పదవి చేపట్టిన ఆయన..2009లో మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఐదేళ్లపాటు పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుంచి పోటీ చేసిన ముఖేశ్​గౌడ్..బీజేపీ క్యాండిడేట్ రాజాసింగ్ చేతిలో ఓడిపోయారు. కార్పొరేటర్ గా ఉన్నప్పటి నుంచి నిత్యం జనాల్లో ఉంటూ సిటీలో తనదైన ముద్ర వేసిన  ముఖేశ్ గౌడ్ గ్రేటర్ హైదరాబాద్ లో మాస్ లీడర్ గా గుర్తింపు పొందారు. దానం నాగేందర్ తో కలిసి సిటీలో పర్యటించేవారు. మహారాజ్ గంజ్ సెగ్మెంట్ లోని బస్తీ వాసుల సమస్యల పరిష్కారానికి..ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు కృషి చేశారు.

గ్రేటర్‌‌లోని మహారాజ్ గంజ్‌‌నియోజకవర్గంలో అత్యధికంగా లోద్ కులస్థులున్నారు. బీసీ వర్గానికి చెందిన లోద్‌‌ కులస్థులకు  ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు ముఖేశ్​ గౌడ్ కృషి చేశారు. 2004లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ కోటా కింద అందాల్సిన రుణాలను ఇప్పించారు. తాగునీటి సమస్యలతో అవస్థలు ఎదుర్కోంటున్న స్థానిక ప్రజలకు జలమండలి శాఖ నేతృత్వంలో నీటి సరఫరా చేసే రిజర్వాయర్‌‌ నిర్మించారు. విద్యుత్‌‌ లోడ్‌‌ అధికమై ఎర్తింగ్‌‌తో ప్రజలు ప్రమాదానికి గురవుతున్నారని పదుల సంఖ్యలో సబ్‌‌స్టేషన్లు ఏర్పాటు చేయించారు. స్థానిక నియోజకవర్గంలోని ప్రజలతో మమేకమై అనేక సేవలందించారు. గోషామహల్ సెగ్మెంట్ లోని జనం ముఖేశ్​ గౌడ్ సేవలను గుర్తు చేసుకుంటున్నారు. మాజీ మంత్రులు దానం నాగేందర్‌‌, ముఖేశ్‌‌ గౌడ్‌‌ ప్రాతినిద్యం వహించే నియోజకవర్గాలు పక్కపక్కన ఉండటంతో ఇద్దరు కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేది. వీరితో పాటు మాజీ ఎంపీ అంజన్‌‌కుమార్‌‌ కూడా కలిసి తిరిగే వారు. దీంతో నగరవాసులు ఈ ముగ్గురిని ‘త్రిమూర్తులు’ అని పిలిచేవారు.

ముఖేశ్​గౌడ్..  టీడీపీ సినీయర్‌‌ నాయకులు, మాజీ మంత్రి తూళ్ల దేవేందర్‌‌ గౌడ్‌‌కు  స్వయానా మేనల్లుడు. మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ కుటుంబానికి ముఖేష్​ కుటుంబానికి మధ్య బంధుత్వం ఉంది. కార్పొరేటర్‌‌, ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న సందర్భాల్లో ముఖేశ్‌‌ గౌడ్‌‌ శుభకార్యాలకు, ప్రారంభోత్సవాలకు పిలిచిన ప్రతీ కార్యక్రమానికి హాజరయ్యేవారని స్థానికులు చెబుతున్నారు. సోమవారం ముఖేశ్​ గౌడ్ భౌతిక కాయాన్ని పలు పార్టీలకు చెందిన నేతలు, రాజకీయ ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు.  ముఖేశ్‌‌గౌడ్‌‌ భౌతికకాయానికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రజల సందర్శనార్థం  ఉదయం 10 నుంచి 11 గంటల వరకు గాంధీభవన్‌‌లో, తర్వాత ఉదయం 11  నుంచి 12 గంటల వరకు మొజంజాహి మార్కెట్‌‌లోని ఆయన ఇంటి వద్ద పార్థివదేహాన్ని ఉంచనున్నారు.  అనంతరం అంతిమయాత్రగా బయలుదేరి ఫిల్మ్‌‌నగర్‌‌లోని జేఆర్‌‌సీ ఫంక్షన్‌‌ హాల్‌‌ సమీపంలో ఉన్న గౌడ శ్మశానవాటిలో

అంత్యక్రియలు నిర్వహించనున్నారు.