ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల కోసం.. మ్యూల్‌ అకౌంట్లు..భైంసాలో మీసేవ కేంద్రంగా దందా

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల కోసం.. మ్యూల్‌ అకౌంట్లు..భైంసాలో మీసేవ కేంద్రంగా దందా
  • ఫేక్‌ అకౌంట్లతో రూ.కోట్లలో లావాదేవీలు
  • కమీషన్‌ ఆశ చూపి కొందరితో అకౌంట్లు ఓపెన్‌ చేయిస్తున్న ముఠా
  • పాస్‌బుక్స్‌, ఏటీఎం కార్డులు తమ వద్దే ఉంచుకుంటున్న వైనం

నిర్మల్, వెలుగు: కమీషన్‌ ఇస్తామంటూ అమాయకులను నమ్మించి, వారితో అకౌంట్లు ఓపెన్ చేయిస్తున్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వాహకులు, సైబర్‌ నేరగాళ్లు వాటిని తమ అక్రమ వ్యవహారాలకు వాడుకుంటున్నారు. అకౌంట్‌కు సంబంధించిన పాస్‌బుక్‌, ఏటీఎం కార్డును తమ వద్దే ఉంచుకొని.. అకౌంట్‌ హోల్డర్‌కు తెలియకుండానే కోట్ల రూపాయల లావాదేవీలు నడిపిస్తున్నారు. నిర్మల్‌ జిల్లా భైంసా కేంద్రంగా జరుగుతున్న ఈ దందాలో వందల సంఖ్యలో మ్యూల్‌ అకౌంట్లు ఓపెన్‌ అయినట్లు తెలుస్తోంది. 

భైంసాలోని మీ–సేవ కేంద్రంగా దందా..

భైంసా పట్టణంలోని ఓ మీ–సేవ కేంద్రంగా, సయ్యద్‌ ఆజం అనే వ్యక్తి సూత్రధారిగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ దందా జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు మూడు రోజుల క్రితం సదరు సెంటర్​పై దాడి చేశారు. ఈ దాడిలో రూ.2కోట్ల వరకు నగదు, బంగారం, పలు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు లభించాయి. వీటితో పాటు పెద్దసంఖ్యలో ఆధార్‌, పాన్‌ కార్డులు, బ్యాంక్‌ అకౌంట్లకు సంబంధించిన పాస్‌బుక్స్‌, సిమ్‌ కార్డులు దొరికాయి.

కమీషన్‌ పేరుతో అమాయకులకు వల

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, మట్కా వంటి అక్రమ దందాలతో సంబంధాలున్న సయ్యద్‌ ఆజం.. కమీషన్‌ పేరుతో అమాయకులను నమ్మించి వారి పేరిట మ్యూల్‌ అకౌంట్లు ఓపెన్‌ చేయిస్తున్నారు. తర్వాత ఒక్కో ఖాతాదారునికి రూ.5 వేలు చెల్లించి వారి వద్ద నుంచి పాస్‌బుక్స్‌, చెక్‌బుక్స్‌, ఏటీఎం కార్డులను తీసుకొని తన వద్దే ఉంచుకుంటున్నాడు. 

బ్యాంక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసే వరకే వారితో సంప్రదింపులు జరుపుతున్న ఆజం.. తర్వాత అసలు అకౌంట్‌ హోల్డర్లకు తెలియకుండానే లావాదేవీలు జరుపుతున్నాడు. మ్యూల్ అకౌంట్‌హోల్డర్లకు సంబంధించిన ఫోన్‌ నంబర్లను కూడా సయ్యద్ ఆజమే సమకూర్చేవాడని తెలుస్తోంది. ఇతరుల పేరిట సిమ్‌ తీసుకొని ఆ నంబర్‌ను సదరు మ్యూల్‌ అకౌంట్‌కు లింక్‌ చేయించేవాడు. ఈ సిమ్‌ కార్డులను కూడా ఆజం తన వద్దే ఉంచుకునేవాడు. కాగా ఈ అంశం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.