తాడ్వాయి, వెలుగు : మేడారం జాతర ఆలయ పరిసరాల్లో ల్యాండ్ స్కేపింగ్, వనదేవతల ఆలయ పునరుద్ధరణ పనులను పూర్తి చేయాలని ములుగు కలెక్టర్ దివాకర అన్నారు. శనివారం మహా జాతర ఆలయ పునరుద్ధరణ పనులు, ల్యాండ్ స్కేపింగ్ పనులను ఆయన డీఎఫ్ వో రాహుల్ కిషన్ జాదవ్ తో కలిసి పరిశీలించారు.
ఆలయ ప్రాంగణంలో ప్రాకారపు రాతి స్తంభాలపై బ్రాకెట్స్ లను, ప్రధాన ఆర్చి, రాతి స్తంభాలపై పిటి బీమ్స్ వెంటనే అమర్చాలన్నారు. ఆలయ పరిసరాలు, జంపన్న వాగు, ఆర్టీసీ బస్ స్టాండ్ లలో పారిశుధ్య పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటయ్య, దేవాదాయ శాఖ అధికారి వీరస్వామి, ఎఫ్ డీవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
