నవభారత నిర్మాణంలో సర్దార్ పటేల్ పాత్ర కీలకం : కలెక్టర్ దివాకర

నవభారత నిర్మాణంలో  సర్దార్ పటేల్ పాత్ర కీలకం : కలెక్టర్ దివాకర

ములుగు, వెలుగు : నవభారత నిర్మాణానికి నిరంతరం కృషి చేసిన మహా వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ పయనించాలని ములుగు కలెక్టర్ దివాకర పిలుపునిచ్చారు. స్వాంతంత్ర్య సమరయోధులు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మేరా యువ భారత్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై పటేల్, భరతమాత ఫొటోలకు నివాళులర్పించారు.

 ఈ సందర్భంగా భారీ సంఖ్యలో హాజరైన విద్యార్థుల ఐక్యత పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ భారత దేశంలో స్వేచ్ఛ కోసం తపించిన వల్లభాయ్​ పటేల్​ ఎన్ని భాషలు, ఎన్ని ప్రాంతాలు ఉన్నా అందరూ ఒకటేనని చాటి చెప్పారన్నారు. అనంతరం మేరా యువభారత్ ఉమ్మడి వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేశ్​ మాట్లాడుతూ ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తితో దేశ ఐక్యతను ఈ మార్చ్​ చాటి చెబుతోందన్నారు. కార్యక్రమంలో డీవైఎస్వో సర్దార్ సింగ్, సూపరిండెంట్ బానోతు దేవిలాల్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ, మై భారత్ వలంటీర్లు, సుమారు వెయ్యి మంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.