మేడారం జాతర ముందు రాజకీయ బదిలీలు!

మేడారం జాతర ముందు రాజకీయ బదిలీలు!

 

జయశంకర్​ భూపాలపల్లి, వెలుగు: ములుగు జిల్లా కలెక్టర్​ సి.నారాయణరెడ్డి ఆకస్మిక బదిలీ వెనుక రాజకీయ ఒత్తిళ్లు పనిచేశాయని తెలుస్తోంది. మేడారం జాతర పనుల విషయంలో రాజీ పడకపోవడం, పనుల అప్పగింత విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించడం వల్లే కలెక్టర్​ను రాత్రికి రాత్రి ట్రాన్స్​ఫర్​ చేసినట్లు అఫీషియల్, పొలిటికల్​ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వ్యహారంలో రాష్ట్ర మంత్రి ఒకరు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ములుగు జిల్లాకు చెందిన నేతలు కొందరు మంత్రిని కలిసి వచ్చిన వెంటనే ట్రాన్స్ ఫర్ ఆర్డర్లు రావడం ఇందుకు ఊతమిస్తోంది. సరిగ్గా రెండేళ్ల కిందట మేడారం జాతరకు ముందే అప్పటి కలెక్టర్​ఆకునూరి మురళిని ట్రాన్స్​ఫర్​ చేయగా, నేడు నారాయణరెడ్డి బదిలీ​ కావడంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్నతాధికారుల్లో చర్చ జరుగుతోంది.

రూల్స్​ ప్రకారం కలెక్టర్​.. కుదరదని లీడర్లు..

వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర జరగనుంది. జాతర ఏర్పాట్లలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లను విడుదల చేసింది. గతంలో మేడారం జాతర పనులను నామినేషన్​ వర్క్​లుగా విభజించి తూతూ మంత్రంగా చేపట్టి, నిధులు కాజేయడం అన్నట్లుగా ఉండేది. మహా జాతర జరుగుతున్న సమయంలోనూ ఓ వైపు భక్తులు ఉంటే.. మరోవైపు పనులు చేస్తూ ఉండేవారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. ఆ పార్టీకి చెందిన నేతలే పనులు చేయడం ఇక్కడ ఆనవాయితీ. కానీ ఈసారి కలెక్టర్​ నారాయణరెడ్డి రాజకీయ నేతల ఆగడాలకు చెక్​పెట్టారు. పనులను నామినేషన్​ వర్క్​లుగా విభజించడానికి అంగీకరించలేదు.  సంక్రాంతి లోపే పనులు పూర్తిచేయాలని కండీషన్​ పెట్టారు. రూ.47 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్​ శాంక్షన్లు ఇచ్చి టెండర్లు పిలిపించారు. గడువులోగా పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనుల నాణ్యత పరిశీలించడానికి మానిటరింగ్​ కమిటీని ఏర్పాటు చేసి ప్రతి రోజు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇవేవీ అధికారపార్టీ నేతలకు రుచించలేదు. ప్రధానంగా ములుగు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కలెక్టర్​ చర్యలను జీర్ణించుకోలేకపోయారు. ఆయన ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన టీఆర్​ఎస్​ నేతలంతా సరిగ్గా నాలుగు రోజుల క్రితం వరంగల్​ వెళ్లారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి నివాసంలో పంచాయితీ పెట్టారు. అదే రోజు ఈ విషయం మీడియాకు లీకైంది. ఇక జిల్లా కలెక్టర్​ను బదిలీ చేస్తారనే ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే ఆదివారం రాత్రి  కలెక్టర్​ నారాయణరెడ్డిని బదిలీ చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. 2018లో కూడా అచ్చం ఇలాగే అప్పటి జయశంకర్​ భూపాలపల్లి కలెక్టర్ ఆకునూరి మురళిని కూడా ప్రభుత్వం మహా జాతరకు ముందే బదిలీ చేసింది.  నిక్కచ్చిగా వ్యవహరించడం వల్లే అప్పట్లో ఆయన ట్రాన్స్​ఫర్​ జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మళ్లీ రెండేళ్ల తర్వాత కూడా ఇదే సీన్​ రిపీట్అయ్యింది. మేడారం జాతర పనులకు సంబంధించి తమ మాట వినకుంటే కలెక్టర్​స్థాయి వ్యక్తులను కూడా ట్రాన్స్​ఫర్​ చేసే స్థాయికి ఇక్కడి పొలిటికల్​ శక్తులు ఎదిగిన తీరు చర్చనీయాంశంగా మారింది.