మంగపేట, వెలుగు: నకిలీ విత్తనాలు అంటగట్టారని ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట గ్రామంలోని మన గ్రోమోర్ సెంటర్ కు బాధిత రైతులు బుధవారం తాళాలు వేశారు. బాధిత రైతులు మాట్లాడుతూ మన గ్రోమోర్ సెంటర్ లో యంటియూ–7021 పొట్టి స్వర్ణ రకం విత్తనాలను కొనుగోలు చేశామని, కోత దశకు వచ్చినప్పటికీ 60 శాతం మాత్రమే గింజ వచ్చిందని, మిగిలిన 40 శాతం గింజ ఇప్పుడే వస్తోందని తెలిపారు.
నకిలీ విత్తనాలు ఇచ్చి మోసం చేశారని, ఈ విషయాన్ని సెంటర్ నిర్వాహకుడితో పాటు అగ్రికల్చర్ అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదన్నారు. చేసేదేమి లేక షాప్ కు తాళం వేశామని తెలిపారు. బాధిత రైతులు ముళ్లపూడి శ్రీనివాసరావు, మల్లిరెడ్డి నాగేందర్ రెడ్డి, పూనెం నాగేశ్, కుర్సం వెంకటేశ్వర్లు, ఆముదలపల్లి శ్రీను, పాలేటి శ్రీహరి, రిమ్మనపూడి సతీశ్ పాల్గొన్నారు.
