ములుగు, వెలుగు : ములుగు జిల్లాలో పది మండలాల్లో ‘మన ఇసుక వాహనం’ అమలులోకి రానుందని, ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక సరఫరా చేయనున్నామని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. స్థానిక గృహ నిర్మాణాలకు, ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వం చేపట్టిన నిర్మాణ అవసరాలకు ఇసుకను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. "మన ఇసుక వాహనం" అమలు ములుగు జిల్లా లోని 10మండలాల్లో అందుబాటులోకి వచ్చిందని, జిల్లాలోని మొట్లగూడెం, పస్రా, రాఘవపట్నం, రంగాపూర్, సోమలగడ్డ (గోవిందరావుపేట మండలంలో) గ్రామాల్లో ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేశామన్నారు. tsmiv.cgg.gov.in వెబ్సైట్లో ఇసుక బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఇసుక సరఫరా సమాచారం కోసం స్థానిక తహసీల్దార్‌ను సంప్రదించవచ్చునని కలెక్టర్ వివరించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ సీహెచ్. మహేందర్ జి, డీఆర్డీఓ చంద్ర శేఖర్ రెడ్డి, మైన్స్ ఏడీ జయ రాజు, హౌసింగ్ పీడీ సూర్య నారాయణ పాల్గొన్నారు.
