
ములుగు, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షానికి ములుగు జిల్లా మల్లంపల్లి సమీపంలో 163 హైవేపై ఉన్న ఎస్సారెస్పీ వంతెన కుంగిపోయింది. శిథిలావస్థలో ఉన్న ఎస్సారెస్పీ వంతెన పక్కనే కొత్తగా బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఈక్రమంలో పాత వంతెనపై భారీ వాహనాలు వెళ్తుండగా గురువారం సాయంత్రం కుంగిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా హైవే అధికారులు తాత్కాలిక వంతెన పనులను ప్రారంభించారు.
టెంపరరీ బ్రిడ్జి పనులు పూర్తయ్యేందుకు నాలుగు రోజులు పట్టే అవకాశం ఉండడంతో అప్పటి వరకు వాహనాలను దారి మళ్లించారు. దీంతో వరంగల్, హన్మకొండ నుంచి ములుగు, ఏటూరునాగారం వైపు వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇదిలాఉంటే ఎస్సారెస్పీ వంతెన కుంగిపోవడంతో నాలుగు రోజులు మంచినీటి సప్లై నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు.