
భైంసా, వెలుగు : బాసరకు వస్తే ఓడిపోతానన్న భయంతోనే ఎనిమిదేళ్లలో ఒక్కసారి కూడా సీఎం కేసీఆర్ ఇక్కడికి రాలేదని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. బాసర సరస్వతీ ఆలయాన్ని టీఆర్ఎస్ సర్కారు అభివృద్ధి చేయడంలేదని ఫైర్ అయ్యారు. సోమవారం ఆమె అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేకపూజలు చేశారు. వేద పండితులు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. ఆలయంలో సౌకర్యాలు లేవని, భక్తులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సొంత జిల్లాలో ఉన్న ఈ గుడిని పట్టించుకోవడంలేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు బాసరను అన్నివిధాలా అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు సీతక్కను సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు ఆనంద్ రావు పటేల్, సాయినాథ్, రమేశ్ పాల్గొన్నారు.