జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వెలుగు : కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ లీడర్ల మధ్య నడుస్తున్న పొలిటికల్వార్లో ట్రైబల్ వర్సిటీ నలిగిపోతున్నది. ఇటీవల జరిగిన మేడారం జాతర వేదికగా మరోసారి ఇరు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఏడాది కాలంగా సందర్భం దొరికిన ప్రతిసారీ తప్పు మీదంటే మీదంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూనే ఉన్నారు. తెలంగాణలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సెంటర్ రూ.40 కోట్లు ఇచ్చినా స్టేట్ గవర్నమెంట్ ఇప్పటికీ భూమి సేకరించి ఇవ్వలేదని కేంద్ర మంత్రులు ఆరోపిస్తుంటే, కావాల్సిన ల్యాండ్ ఏనాడో సేకరించి ఇచ్చినా నేటికీ క్లాసులకు పర్మిషన్ ఇవ్వడం లేదని రాష్ట్రమంత్రులు అంటున్నారు. ఇందులో నిజానిజాల సంగతేమోగానీ, ఈ రెండు వర్గాల మధ్య తెలంగాణలోని గిరిజన విద్యార్థులు మాత్రం నష్టపోతున్నారు.
ఏది నిజం?
ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ములుగు అనువైనదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో 2018లో కేంద్ర మానవ వనరుల శాఖ ఆఫీసర్లు వచ్చి భూములను పరిశీలించారు. యూనివర్సిటీకి 498 ఎకరాలు అవసరముంటుందని చెప్పగా169 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏటూరునాగారం ఐటీడీఏకు అప్పగించామని స్టేట్ ఆఫీసర్లు చెబుతున్నారు.మరో 117ఎకరాల అసైన్డ్ ల్యాండ్సేకరణ కోసం లబ్ధిదారులకు అవార్డు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోందంటున్నారు. అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి 212 ఎకరాలు అవసరం లేదని, 50 ఎకరాలు చాలని సెంట్రల్ ఆఫీసర్లు స్పష్టం చేయగా, ఇది కూడా ఓకే అయ్యిందంటున్నారు. మొత్తంగా 336 ఎకరాలు సేకరించామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా, ఇవన్నీ కాకి లెక్కలని, ఈ వివరాలను అఫీషియల్‌గా సెంట్రల్ కు పంపలేదని సెంట్రల్ మినిస్టర్లు ఆరోపిస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్రాజకీయాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లటానికి ప్రయత్నిస్తోందని అంటున్నారు. 2022‒23 సెంట్రల్ బడ్జెట్‌లో తెలంగాణ ట్రైబల్ యూనివర్సిటీ కోసం రూ.40 కోట్లు కేటాయించామని, తమ చిత్తశుద్దిని తెలియజేయడానికి ఇదే నిదర్శనమంటున్నారు. అక్కడ స్టార్టయినయ్...ఇక్కడెప్పుడు?
ఏపీలోని విజయనగరం జిల్లా కొండకారకం విలేజీలో రెండేండ్ల కిందటే ట్రైబల్ యూనివర్సిటీ క్లాసులు స్టార్టయ్యాయి. డిగ్రీ, పీజీల్లో12 రకాల కోర్సులు ప్రవేశపెట్టి తరగతులు నిర్వహిస్తున్నారు. కానీ మన దగ్గర మాత్రం అడుగు ముందుకు పడడం లేదు. భూసేకరణ కొనసాగేంత వరకు టెంపరరీ క్లాసుల కోసం ఏర్పాట్లు చేయాలని 2018లోనే కేంద్ర మానవవనరుల శాఖ ఆఫీసర్లు సూచించారు. దీని కోసం ములుగులోని ఐటీడీఏ పరిధిలో ఉన్న జాకారం యూత్ ట్రైనింగ్‌సెంటర్ బిల్డింగ్‌ను చూపించగా ఓకే చేశారు. ఇక్కడినుంచి వెళ్లిన వెంటనే రూ.10 కోట్లు కేటాయిస్తూ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. అయితే స్టేట్ గవర్నమెంట్ ఈ డబ్బులను భూసేకరణకు ఉపయోగించిందని, అందుకే టెంపరరీ క్లాసులు స్టార్ట్ కావడం లేదని ట్రైబల్ స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. 2022‒23 సెంట్రల్ బడ్జెట్‌లో కూడా తెలంగాణ ట్రైబల్ యూనివర్సిటీ కోసం రూ.40 కోట్లు కేటాయించినా క్లాసుల నిర్వహణపై దృష్టి పెట్టడం లేదంటున్నారు.
‘ములుగులో నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సెంట్రల్ గవర్నమెంట్ చిత్తశుద్దితో ఉంది. గతంలో రూ.10 కోట్లు మంజూరు చేశాం. 2022‒23 బడ్జెట్‌లో రూ.40 కోట్లు కేటాయించినం. కానీ, స్టేట్ గవర్నమెంట్ రాజకీయాలు చేస్తోంది. భూసేకరణ చేసి ఇవ్వాల్సి ఉండగా, టైం వేస్ట్చేస్తోంది. యూనివర్సిటీ పూర్తయ్యే వరకు టెంపరరీ క్లాసులు నిర్వహిస్తామని అఫీషియల్‌గా సెంట్రల్ గవర్నమెంట్‌ను కోరడం లేదు.
‒ ఈ నెల18న మేడారంలో సెంట్రల్ మినిస్టర్స్ కిషన్ రెడ్డి, రేణుకాసింగ్
‘ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటును సెంట్రల్ గవర్నమెంటే పట్టించుకోవట్లేదు. భూసేకరణ పూర్తి చేసి కేంద్రానికి పంపించినా రెస్పాన్స్ లేదు. టెంపరరీ క్లాస్‌ల నిర్వహణకు పర్మిషన్ ఇస్తే మేం క్లాసులు నిర్వహించుకుంటాం’
‒ ఈ నెల 19న మేడారంలో స్టేట్ మినిస్టర్స్
ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్ రెడ్డి
క్లాసులు త్వరగా ప్రారంభించాలి
నేషనల్ ట్రైబల్యూనివర్సిటీ క్లాసులను వెంటనే ప్రారంభించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తుండడంతో ఇక్కడి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. అందుబాటులో ట్రైబల్ యూనివర్సిటీ ఉంటే గిరిజనుల్లో చదువుకోవాలనే తపన కూడా పెరుగుతుంది. రేషనలైజేషన్, కరోనాతో ఇప్పటికే బడులు మూతపడి గిరిజనులు చదువులకు దూరమవుతున్నారు. ప్రభుత్వం త్వరగా యూనివర్సిటీ బిల్డింగ్నిర్మాణం చేపట్టి, టెంపరరీ క్లాసులు స్టార్ట్ చేయాలి.
‒కొమురం ప్రభాకర్, పెసా ఉమ్మడి వరంగల్ జిల్లా కో ఆర్డినేటర్
