ఇంకా వరద నీటిలోనే ములుగు గ్రామాలు

ఇంకా వరద నీటిలోనే ములుగు గ్రామాలు
  • తిండి, తిప్పలు లేక బాధితుల అవస్థలు
  • భారీ వర్షాలకు ములుగు జిల్లా అతలాకుతలం

ములుగు జిల్లా: గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ములుగు జిల్లా అతలాకుతలం అవుతోంది. అనేక ప్రాంతాలు, గ్రామాలు ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయి. గత 5 రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు ఏటూరునాగారంలోని కొన్ని కాలనీలు, చుట్టుపక్కల గ్రామాలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే సీతక్క

ములుగు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే సీతక్క విస్తృతంగా పర్యటిస్తున్నారు. వరద ముంపునకు గురైన ప్రాంతాలను సందర్శిస్తూ.. బాధితులకు అవసరమైన సహాయం అందేలా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. వర్షాల దెబ్బకు ఇళ్లన్నీ నీట మునగడంతో సర్వస్వం కోల్పోయిన బాధితుల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయని.. బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని సీతక్క డిమాండ్ చేశారు. టెండర్లు, కాంట్రాక్టర్ల పేరుతో కరకట్ట నిర్మాణంపై కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. వరద నీటిలో నాని ఇల్లు కూలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.