26/7 ముంబై వరదలు: ఇరవైయేళ్ల తరువాత కూడా.. నగరం ఇంకా వరదలకు గురవుతోంది

26/7 ముంబై వరదలు: ఇరవైయేళ్ల తరువాత కూడా.. నగరం ఇంకా వరదలకు గురవుతోంది

భారీ వర్షాల కారణంగా దేశంలో మెట్రో నగరాలు ఏటా వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నీట మునిగిన కాలనీ, రోడ్లు, వీధులు జలమయం, ట్రాఫిక్ గందరగోళం సర్వసాధారణం అయిపోయాయ్. ముఖ్యంగా ముంబై లాంటి మెట్రో నగరం భారీ వర్షాలకు ముంపునకు గురవుతుంది. జూలై 26, 2005 ముంబై చరిత్రలో అత్యంత చీకటి రోజు. అత్యంత విపత్కర రోజులలో ఒకటి. ఈ విపత్తు సంభవించి నేటికి 20యేళ్లు. ఇప్పుడు కూడా ముంబైలో అవే తిప్పలు. 

జూలై 26, 2005న సంభవించిన వరద ముంబై నగరం ఎదుర్కొన్న అత్యంత దారుణమైన ప్రకృతి విపత్తు. ముంబైలో ఇంతటి వర్షాలు ఎప్పుడూ చూడలేదు. 600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ముంబై నగరం 24 గంటల్లో దాదాపు 944.2 మి.మీ వర్షపాతాన్ని తట్టుకోలేకపోయింది. ఆరోజు భారతదేశ వాణిజ్య రాజధానిలో మేఘాల విస్ఫోటనం తర్వాత కురిసిన భారీ వర్షపాతంతో పాటు వచ్చిన అలలు విధ్వంసం సృష్టించాయి. వీటి జ్ఞాపకాలు ముంబైలోని ప్రతి ఒక్కరి మనస్సులో ఇప్పటికీ తాజాగా మెదులుతూనే ఉన్నాయి. 

జూలై 26 ఉదయం 8 గంటల నుంచిరాత్రి 8 గంటల మధ్య ఒకే రోజు 644 మి.మీ వర్షం కురిసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన 24 గంటల్లో ఇది ఎనిమిదవ అత్యంత భారీ వర్షపాతం. నగరంలోని అనేక ప్రాంతాలు మునిగిపోయాయి. విద్యుత్ నిలిచిపోయింది. కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విపత్తులో వెయ్యిమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 14వేల కంటే ఎక్కువ ఇళ్లు ధ్వంసమయ్యాయి. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 

37వేల కంటే ఎక్కువ ఆటో-రిక్షాలు, 4వేల టాక్సీలు, 900 బెస్ట్ బస్సులు 10వేల ట్రక్కులు ,టెంపోలు దెబ్బతిన్నాయి. నగరం దాదాపు రూ.2వేల కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ విపత్తును సాధారణంగా 26/7 అని పిలుస్తారు. ఈ జూలై 26 ఆ విపత్తు సంభవించి ఇరవై యేళ్లు గడిచాయి. అయినా ముంబై నగరంలో ఇంకా  అవే వరదలు, అవే మునకలు, ఏమీ మారలేదు అంటున్నారు నెటిజన్లు. 

 ఆ రోజును గుర్తుచేసుకుంటూ అనేక మంది సోషల్ మీడియాయూజర్లు 2005 ముంబై వరదల దృశ్యాలను పోస్ట్ చేశారు. ఈ ఘటన జరిగి 20 సంవత్సరాలు అయ్యింది.కానీ ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ ఇంకా కళ్లముందు కనిపిస్తున్నాయంటూ తమ అనుభవాలను షేర్ చేస్తున్నారు.