పది రోజుల్లో 20 కేజీల కరోనా మందులు.. ఫ్రీగా ఇస్తున్న డాక్టర్ దంపతులు

పది రోజుల్లో 20 కేజీల కరోనా మందులు.. ఫ్రీగా ఇస్తున్న డాక్టర్ దంపతులు
  • మిగిలిన మందులు సేకరిస్తున్న డాక్టర్ల జంట
  • మెడ్స్ ఫర్ మోర్ పేరుతో మందుల సేకరణ
  • కొనలేని వారికి ఫ్రీగా అందిస్తూ సాయం

కరోనావైరస్ తీవ్రత పెరుగుతుండటంతో చాలామంది ముందుజాగ్రత్తగా మెడిసిన్స్ కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకుంటున్నారు. అదేవిధంగా కరోనా బారినపడిన వారికి వాడాల్సిన మెడిసిన్ కిట్లను ప్రభుత్వాలు అందజేస్తున్నాయి. అయితే చాలామంది కరోనా రోగులు.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆ మందులను అలాగే వదిలేస్తున్నారు. తద్వారా దేశవ్యాప్తంగా మందులకు కొరత ఏర్పడుతుంది. అంతేకాకుండా కరోనా మందులకు ధర ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది ఆ మందులు కొనే స్థోమత లేక ఇబ్బందిపడుతున్నారు. ఇవన్నీ గమనించిన ముంబై డాక్టర్ జంట.. కరోనా నుంచి కోలుకున్న వారివద్ద వృధాగా ఉన్న మందులను సేకరించి అవసరమైన వారికి ఉచితంగా అందించాలని అనుకున్నారు.

ఈ వినూత్న కార్యక్రమానికి డాక్టర్ మార్కస్ రానీ, అతని భార్య డాక్టర్ రైనా శ్రీకారం చుట్టారు. అందుకోసం మెడ్స్ ఫర్ మోర్ పేరుతో మే1న ఓ కార్యక్రమం స్టార్ట్ చేశారు. ‘హౌసింగ్ సొసైటీలు, చుట్టుపక్కల బిల్డింగుల నుంచి మందులు సేకరించడం ప్రారంభించాం. కేవలం పది రోజుల్లోనే 20 కేజీల మందులను సేకరించగలిగాం. వాటిని శానిటైజ్ చేసి.. అవసరం ఉన్నవారికి అందిస్తున్నాం. ఇద్దరమే పది రోజుల్లో ఇన్ని మందులు సేకరిస్తే.. మరికొంతమందిని కలుపుకుంటే మరిన్ని మందులు సేకరించొచ్చనే ఆలోచనవచ్చింది. వెంటనే చుట్టుపక్కల ఉన్న 8 మంది సాయం తీసుకొని ఒక బృందాన్ని ఏర్పాటుచేసి.. మందులను సేకరిస్తున్నాం. ఇప్పుడు మాకు 100 భవనాలు సహకరిస్తున్నాయి. ఆ బిల్డింగులనుంచే మందులు సేకరిస్తున్నాం. కోవిడ్ -19 రోగులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తున్న యాంటీబయాటిక్స్, ఫాబిఫ్లు, పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్లు, ఇన్హేలర్లు, విటమిన్లు, యాంటాసిడ్లు వంటి అన్ని రకాల ఉపయోగించని మందులను మెడ్స్ ఫర్ మోర్ సేకరిస్తుంది. కొంతమంది పల్స్ ఆక్సిమీటర్లు మరియు థర్మామీటర్లు వంటి ప్రాథమిక సామాగ్రిని కూడా అందిస్తున్నారు’ అని డాక్టర్ దంపతులు తెలిపారు.