వ్యాక్సిన్ తీసుకున్నా.. డాక్టర్‌కు రెండుసార్లు కరోనా

వ్యాక్సిన్ తీసుకున్నా.. డాక్టర్‌కు రెండుసార్లు కరోనా

ముంబై: కరోనా బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే టీకా తీసుకున్నా కరోనా రాదని చెప్పలేమని డాక్టర్లు, సైంటిస్టులు అంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా పలువురు కొవిడ్ బారిన నేపథ్యంలో వ్యాక్సిన్ ఎంతవరకు సురక్షితం అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. వీటిని పక్కనబెడితే.. ముంబైకి చెందిన ఓ డాక్టర్‌కు టీకా తీసుకున్నాక కూడా రెండుసార్లు కరోనా సోకడం హాట్‌ టాపిక్‌గా మారింది. 26 ఏళ్ల శ్రుతి హలరీ అనే ఆ డాక్టర్ గత 13 నెలల్లో మూడు సార్లు కరోనా బారిన పడ్డారు. వ్యా్క్సిన్ తీసుకున్న తర్వాత ఆమెకు రెండు సార్లు వైరస్ సోకింది. దీంతో ఆమె జీనోమ్ సీక్వెన్సింగ్‌‌‌ను విశ్లేషించడానికి వాటి శాంపిల్స్‌‌ను బ‌ృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) తీసుకుంది. 

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా బారిన పడటం గురించి శ్రుతి హలరీ స్పందించారు. ఇది ఒకింత తనను ఆశ్చర్యపరుస్తోందని శ్రుతి అన్నారు. ‘ఓ డాక్టర్‌గా నేను అవాక్కవుతున్నా. కరోనా నుంచి తప్పించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సేఫ్టీ ప్రోటోకాల్స్ గురించి పేషెంట్లకు నేను సలహాలు ఇస్తుంటా. కానీ నాకూ కరోనా సోకింది. కొవిడ్ లక్షణాలు సీరియస్‌గా లేకున్నా నేను ఆస్పత్రిలో చేరాను. 45 రోజుల వ్యవధిలో రెండోసారి నాకు కరోనా సోకింది. ఇన్ఫెక్షన్ రీయాక్టివేషన్ అయ్యిందని భావిస్తున్నా. ప్రస్తుతం బాగున్నాను. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ లేదు’ అని శ్రుతి పేర్కొన్నారు.