నేపాల్ వైపు నుంచి ఎవరెస్ట్ పైకి.. అతిపిన్న వయస్కురాలిగా కామ్య రికార్డ్

నేపాల్ వైపు నుంచి ఎవరెస్ట్ పైకి.. అతిపిన్న వయస్కురాలిగా కామ్య రికార్డ్

న్యూఢిల్లీ: నేపాల్​ వైపు నుంచి ఎవరెస్ట్ అధిరోహించిన ప్రపంచంలోనే అతిపిన్న వయస్కురాలిగా నేవీ అధికారి కూతురు కామ్య కార్తికేయన్ ​రికార్డు సాధించింది. 16 ఏండ్ల కామ్య ముంబైలోని నేవీ చిల్డ్రన్​ స్కూల్​లో 12వ క్లాస్ చదువుతున్నది. ఆమె తండ్రి  నేవీ కమాండర్ ఎస్ కార్తికేయన్​తో కలిసి ఏప్రిల్​ 3న ఎవరెస్ట్​ శిఖరాన్ని అధిరోహించేందుకు కామ్య యాత్ర ప్రారంభించింది. ఈ నెల 20న నేపాల్​ వైపు నుంచి ఎవరెస్ట్ శిఖరానికి చేరుకున్నది. 

ఈ విషయాన్ని భారత నౌకాదళం గురువారం వెల్లడించింది. వెస్టర్న్​ నేవల్​ కమాండ్​ కామ్య ఫొటోను జోడించి వివరాలను ట్వీట్​ చేసింది. “ఎవరెస్ట్​ను అధిరోహించిన రెండో అతి పిన్న వయస్కురాలు, నేపాల్​ వైపు నుంచి ఎవరెస్ట్​ ఎక్కిన అతి పిన్న వయస్కురాలిగా కామ్య రికార్డు సాధించింది” అని పేర్కొంది. అలాగే, ఆరు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించిన రికార్డును కూడా కామ్య సొంతం చేసుకున్నది. 

వచ్చే డిసెంబర్​ నెలలో అంటార్కిటికా ఖండంలోని మౌంట్​ విన్సన్​ మాసిఫ్​ను ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కాగా,  ఎవరెస్ట్​ను అధిరోహించిన అతిపిన్న వయస్కురాలి రికార్డు తెలంగాణకు చెందిన మలావత్​ పూర్ణ పేరుపైన ఉన్నది. ఆమె 13 ఏండ్ల వయసులోనే ఈ ఘనత సాధించింది.