ముంబై మెరిసెన్‌‌‌‌.. 42 రన్స్‌‌‌‌ తేడాతో యూపీ వారియర్స్‌‌‌‌పై గెలుపు

ముంబై మెరిసెన్‌‌‌‌.. 42 రన్స్‌‌‌‌ తేడాతో యూపీ వారియర్స్‌‌‌‌పై గెలుపు
  • రాణించిన బ్రంట్‌‌‌‌, కెర్‌‌‌‌, హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌
  • దీప్తి శర్మ పోరాటం వృథా

న్యూఢిల్లీ: విమెన్స్‌‌‌‌ ప్రీమియర్‌‌‌‌ లీగ్‌‌‌‌ (డబ్ల్యూపీఎల్‌‌‌‌)లో ముంబై ఇండియన్స్‌‌‌‌ కీలక విజయం సాధించింది. నాకౌట్‌‌‌‌ రేస్‌‌‌‌లోకి వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌‌‌‌లో ముంబై బ్యాటర్లు సివర్‌‌‌‌ బ్రంట్‌‌‌‌ (45), అమెలియా కెర్‌‌‌‌ (39), హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ కౌర్‌‌‌‌ (33) చెలరేగారు. దీంతో గురువారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ముంబై 42 రన్స్‌‌‌‌ తేడాతో యూపీ వారియర్స్‌‌‌‌పై నెగ్గింది. టాస్‌‌‌‌ నెగ్గిన ముంబై 20 ఓవర్లలో 160/6 స్కోరు చేసింది. ఓపెనర్లు యాస్తిక భాటియా (9), హేలీ మాథ్యూస్‌‌‌‌ (4) ఫెయిలయ్యారు. 

దీంతో 17/2 స్కోరుతో కష్టాల్లో పడిన ముంబైని బ్రంట్‌‌‌‌ కీలక భాగస్వామ్యాలతో ఆదుకుంది. హర్మన్‌‌‌‌తో మూడో వికెట్‌‌‌‌కు 59 రన్స్‌‌‌‌ జోడించి ఇన్నింగ్స్‌‌‌‌లో నిలకడ తెచ్చింది. చివర్లో కెర్‌‌‌‌ బ్యాట్‌‌‌‌ ఝుళిపించడంతో రన్‌‌‌‌రేట్‌‌‌‌ భారీగా నమోదైంది. ఈ క్రమంలో నాలుగో వికెట్‌‌‌‌కు 28 రన్స్‌‌‌‌ జత చేసి హర్మన్‌‌‌‌ ఔటైనా, కెర్‌‌‌‌ చివరి వరకు క్రీజులో పాతుకు పోయింది. అమన్‌‌‌‌జోత్‌‌‌‌ కౌర్‌‌‌‌ (7)తో ఐదో వికెట్‌‌‌‌కు 13 రన్స్‌‌‌‌ జోడించిన కెర్‌‌‌‌.. చివర్లో సంజీవన్‌‌‌‌ సాజన (22 నాటౌట్‌‌‌‌)తో ఆరో వికెట్‌‌‌‌కు 43 రన్స్‌‌‌‌ భాగస్వామ్యం నెలకొల్పడంతో ముంబై మంచి టార్గెట్‌‌‌‌ను నిర్దేశించింది. 

తర్వాత ఛేజింగ్‌‌‌‌లో యూపీ 20 ఓవర్లలో 118/9 స్కోరుకే పరిమితమైంది. దీప్తి శర్మ (53 నాటౌట్‌‌‌‌) హాఫ్‌‌‌‌ సెంచరీ చేసినా ప్రయోజనం లేకపోయింది. ముంబై బౌలర్లు సైకా ఇషాకి (3/27), బ్రంట్‌‌‌‌ (2/14) ధాటికి యూపీ ఇన్నింగ్స్‌‌‌‌లో ఏడుగురు సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కే పరిమితమయ్యారు. 15 రన్స్‌‌‌‌కే అలీసా హీలీ (3), కిరణ్‌‌‌‌ నవ్‌‌‌‌గిరె (7), చామిరి ఆటపట్టు (3) ఔటయ్యారు. గ్రేస్‌‌‌‌ హారీస్‌‌‌‌ (15), శ్వేత (17) కాసేపు పోరాడినా, పూనమ్‌‌‌‌ (7), ఎకెల్‌‌‌‌స్టోన్‌‌‌‌ (0), ఉమ (8), సైమా (0) నిరాశపర్చారు. బ్రంట్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.