ముంబై ఇండియన్స్ టార్గెట్ 91 పరుగులు

 ముంబై ఇండియన్స్ టార్గెట్ 91 పరుగులు
  • రాజస్థాన్ స్కోర్: 20 ఓవర్లలో 90/9
  • హయ్యెస్ట్ స్కోర్: ఓపెనర్ ఎవిన్ లూయిస్ (24)
  • ప్లే ఆఫ్ బెర్త్ చేరాలంటే ఇరు జట్లు తప్పక గెలవాల్సిన మ్యాచ్

షార్జా: ఐపీఎల్  రెండవ విడుత పోరులో బాగా వెనుకబడి పోయిన ముంబై ఇండియన్స్ ఇవాళ రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో జూలు విదిల్చింది. ముంబై బౌలర్ల ధాటికి రాజస్థాన్ జట్టు చచ్చీ చెడీ కేవలం 90 పరుగులు చేసింది. ఓపెనర్ ఎవిన్ లూయిస్ (24) మినహా మిగిలిన వారంతా చేతులెత్తేశారు. ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే ఇరు జట్లూ తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ ప్రతిష్టాత్మకంగా మారింది. 
ప్లే ఆఫ్ రేసులో నిలబడేందుకు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైన ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ లో ముంబయి టాస్ గెలిచి రాజస్థాన్ కు బ్యాటింగ్ అవకాశం ఇచ్చింది. పిచ్ మొదట బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని కెప్టెన్ రోహిత్ శర్మ అంచనాలను జట్టు బౌలర్లు నిజం చేశారు. నాలుగో ఓవర్లో తొలి వికెట్ పడగొట్టిన ఉత్సాహాన్ని చివరి వరకు కొనసాగించారు. 
నాలుగో ఓవర్ లో ఓపెనర్ యశస్తి జైశ్వాల్ (12) కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మరో ఓవర్ ముగియగానే ఆరో ఓవర్లో మరో ఓపెనర్ ఎనిన్ లూయిస్ (24) కూడా ఔటయ్యాడు. బుమ్రా వేసిన బంతికి ఎవిన్ వికెట్ల ముందు దొరికి పెవిలియన్ చేరాడు. దీంతో స్కోరు 5.3 ఓవర్లకు 41/2గా ఉంది. ఏడో ఓవర్ తొలి బంతికే కెప్టెన్ సంజు శాంసన్ (3) ఔట్ కావడంతో రాజస్థాన్ పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత వరుసగా మిడిలార్డర్ బ్యాటర్లందరూ.. అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. పరుగుల మాట దేవుడెరుగు క్రీజులో నిలదొక్కుకుంటే చాలన్నట్లు ఆడారు. 19 ఓవర్లకు 83 పరుగులు చేసిన రాజస్థాన్ చివరి ఓవర్లో 7 పరుగులు చేసి 9 వికెట్ల నష్టానికి 90 పరుగులకే పరిమితం అయింది. 
తక్కువ టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ తొలి ఓవర్ నుంచే ధాటిగా ఆటను ప్రారంభించింది. కేవలం 5 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. 6 ఓవర్లకు ముంబై స్కోరు 56/2గా ఉంది.