దంచికొట్టిన హర్మన్‌‌ ప్రీత్..ముంబై ఇండియన్స్‌‌ థ్రిల్లింగ్ విక్టరీ

దంచికొట్టిన హర్మన్‌‌ ప్రీత్..ముంబై ఇండియన్స్‌‌  థ్రిల్లింగ్ విక్టరీ
  •    191 టార్గెట్‌‌ ఛేజ్ చేసిన ముంబై

న్యూఢిల్లీ :  కెప్టెన్ హర్మన్‌‌ప్రీత్ కౌర్ (48 బాల్స్‌‌లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 95 నాటౌట్‌‌)  దంచికొట్టడంతో భారీ టార్గెట్‌‌ను ఛేజ్‌‌ చేసిన ముంబై ఇండియన్స్‌‌ డబ్ల్యూపీఎల్‌‌లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్‌‌లో 7 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌‌ను ఓడించింది.  టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్‌‌కు వచ్చిన గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 190/7 స్కోరు చేసింది. దయలన్ హేమలత (40 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 74), బెత్ మూనీ (35 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 66) మెరుపు బ్యాటింగ్‌‌తో చెలరేగారు. 

ఓపెనర్ లారా వోల్‌‌వర్ట్‌‌ (13) ఫెయిలైనా ఈ ఇద్దరూ  రెండో వికెట్‌‌కు 62 బాల్స్‌‌లోనే 121 రన్స్‌‌ జోడించారు.  వీళ్ల జోరుకు గుజరాత్ ఈజీగా 200 దాటేలా కనిపించింది. మూనీ, హేమలతతో పాటు లిచ్‌‌ఫెల్డ్ (3), గార్డ్‌‌నర్‌‌‌‌ (1), కేథరీన్‌‌ బ్రైస్‌‌ (7)ను  ముంబై బౌలర్లు  వెంటవెంటనే ఔట్‌‌ చేశారు. చివర్లో భార్తి ఫుల్మాలి (21 నాటౌట్‌‌) రాణించింది. ముంబై బౌలర్లలో సైకా ఇషాక్ రెండు, హేలీ, షబ్నిమ్, వస్త్రాకర్, సజన తలో వికెట్‌‌ తీశారు. 

అనంతరం హర్మన్‌‌కు తోడు యాస్తికా భాటియా (36 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 49) రాణించడంతో ముంబై 19.5 ఓవర్లలో 191/3 స్కోరు చేసి గెలిచింది. భాటియా, హేలీ మాథ్యూస్ (18) తొలి వికెట్‌‌కు 50 రన్స్ జోడించారు. ఈ ఇద్దరితో పాటు సివర్ బ్రంట్ (2) ఔటైనా.. అమేలియా కౌర్ (12 నాటౌట్‌‌)తో కలిసి హర్మన్‌‌ టీమ్‌‌ను గెలిపించింది. హర్మన్‌‌కే ప్లేయర్ ఆఫ్​ ద మ్యాచ్ అవార్డు లభించింది.