
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. వాంఖడే వేదికగా బుధవారం (మే 21) ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి రాయల్ గా ప్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టింది. మరోవైపు ఢిల్లీ ప్లే ఆఫ్స్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. మొదట బ్యాటింగ్ లో సూర్య కుమార్ యాదవ్ ( 43 బంతుల్లో 73: 7 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ కు తోడు ఆ తర్వాత బౌలర్లందరూ సమిష్టిగా రాణించి విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌట్ అయింది.
ALSO READ | MI vs DC: ముంబై బ్యాటర్ అసాధారణ నిలకడ.. బవుమా వరల్డ్ రికార్డ్ సమం చేసిన సూర్య
181 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే ఊహించని షాక్ తగిలింది. రెండో ఓవర్లో కెప్టెన్ డుప్లెసిస్ (6), మూడో ఓవర్లో రాహుల్ (11) తక్కువ స్కోర్ కే పెవిలియన్ కు చేరారు. ఐదో ఓవర్లో అభిషేక్ పోరెల్ కూడా ఔట్ కావడంతో ఢిల్లీ 27 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పవర్ ప్లేలో 49 పరుగులు చేసిన దిలీప్.. ఆ తరువాత వరుస విరామాల్లో ఢిల్లీ వికెట్లను కోల్పోతూనే వచ్చింది.
విప్రజ్ నిగమ్ కాసేపు మెరుపులు మెరిపించి ఔట్ కాగా.. స్టబ్స్ (5) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. ఈ దశలో సమీర్ రిజ్వి వికెట్ల పతనాన్ని కాసేపు ఆపాడు. క్రీజ్ లో ఉన్నంత సేపు పరుగులు చేయడానికి ఇబ్బందిపడిన రిజ్వి.. 39 పరుగుల వద్ద ఔటయ్యాడు. అశుతోష్ శర్మ (16) కూడా ఔట్ కావడంతో ఢిల్లీ ఓటమి ఖరారైంది. ముంబై బౌలర్లలో సాంట్నర్, బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. విల్ జాక్స్, దీపక్ చాహర్, బోల్ట్, కరణ్ శర్మ తలో వికెట్ తీసుకున్నారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ కు మంచి ఆరంభం లభించినా.. ఆ తర్వాత ఢిల్లీ బౌలర్ల ధాటికి కుదేలయ్యారు. సూర్య కుమార్ యాదవ్ ( 43 బంతుల్లో 73: 7 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ కు తోడు నమన్ ధీర్(8 బంతుల్లో 22: 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ రెండు.. చమీర, కుల్దీప్ , ముస్తాఫిజుర్ తలో వికెట్ పడగొట్టారు.
Dear 2025 IPL playoff teams,
— ESPNcricinfo (@ESPNcricinfo) May 21, 2025
You don't want to play this MI side
🔗 https://t.co/P4yfUKTLyw | #IPL2025 pic.twitter.com/E1nPZkNIeW